
షెడ్యూల్ ప్రకారం సిలబస్ పూర్తి చేయాలి
● నామాలపాడు ఏకలవ్య పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
బయ్యారం: షెడ్యూల్ ప్రకారం పాఠశాలలో సిలబస్ పూర్తి చేయాలని కలెక్టర్ అధ్వైత్‌కుమార్‌సింగ్ ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని నామాలపాడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కిచెన్, డైనింగ్‌హాల్, మ్యూజిక్, తరగతి గదులను తనిఖీ చేసి అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. బోధనాంశాలతో పాటు సబ్జెక్టుల్లో విద్యార్థుల శక్తిసామర్థ్యాలను తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు అర్థమయ్యే పద్ధతుల్లో పాఠాలు బోధించాలని, విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. మెనూ ప్రకారం పరిశుభ్రమైన ఆహారం అందించటంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కలెక్టర్ వెంట పాఠశాల ప్రిన్సిపాల్ తదితరులు ఉన్నారు.
రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
నెహ్రూసెంటర్: ఆస్పత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన సమయంలో వైద్య చికిత్స అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకో వాలన్నారు. ఆస్పత్రి ఆవరణను పరిశుభ్రంగా ఉంచుతూ రోగులకు ఇబ్బందులు కలగకుండా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఫీవర్ వార్డు, పిల్లల వార్డులను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి ఆర్‌ఎంఓ జగదీశ్వర్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.