
పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు
మహబూబాబాద్ రూరల్ : పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే మురళీనాయక్ అన్నారు. మున్సిపల్ అధికారులతో మహబూబా బాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ పట్టణంలో నిర్వహించే బతుకమ్మ పండుగ ఏర్పాట్ల గురించి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకుని, ప్రతీ వీధిలోనూ లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు బతుకమ్మ ప్రాంగణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. పట్టణంలోని వెజ్, నాన్ వెజ్ కూరగాయల మార్కెట్ కోసం రూ.90 లక్షల నిధులు మంజూరు చేయించినా ఇప్పటికీ పనులు అసంపూర్తిగా ఉండడంపై మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా ఆ పనులు పూర్తి చేయాలని, అంతేకాకుండా మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం లోపిస్తుందని, అధికారులు ఎవరైనా పారిశుద్ధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, మున్సిపల్ డీఈ ఉపేందర్, అధికారులు పాల్గొన్నారు.