
కేయూలో ఉద్రిక్తత
● ఇద్దరి విద్యార్థులపై దాడి చేసిన వారిపై కేసు
కేయూ క్యాంపస్: కేయూలో ఇద్దరు విద్యార్థులపై దాడి ఘటనతో శనివారం రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎంబీఏ ఫస్టియర్ విద్యార్థులు గజానంద్, పవన్ శనివారం రాత్రి 8: 20 గంటలకు బైక్‌పై కామన్ మెస్‌కు వెళ్తుండగా గెస్ట్‌హౌస్ ప్రాంతంలో పలువురు అడ్డుకుని దాడి చేశారు. దీంతో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేశారు. దాడిచేసి కొట్టినవారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకొని పోలీస్ వాహనంలో తరలించే యత్నం చేశారు. అక్కడికి చేరుకున్న విద్యార్థులు వాహనాన్ని అడ్డుకొని రాత్రి 11:30 గంటల వరకు ఆందోళన చేపట్టారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, కేయూ సీఐ రవికుమార్, ఎస్సై రవీందర్ తదితరులు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని సర్దిచెప్పారు. చివరికి పోలీసులు ఇద్దరిని మాత్రం అదుపులోనికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత వదిలివేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థులు గజానంద్, పవన్ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన గట్టు ప్రశాంత్, అఖిల్‌తోపాటు మరికొందరిపై కేసును నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
నాన్‌బోర్డర్లు రాకుండా చర్య తీసుకోవాలి
హాస్టళ్లలోకి నాన్‌బోర్డర్లు రాకుండా చూడాలని ఆదివారం సాయంత్రం 6:45 గంటలకు విద్యార్థులు కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళన చేశారు. దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు, కేయూ పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్, హాస్టళ్ల డైరెక్టర్ వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి ఆందోళన చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. నాన్‌బోర్డర్లపై కేయూ అధికారులు చర్యలు తీసుకుంటే సహకరిస్తామని పేర్కొన్నారు. దీంతో రాత్రి 11 గంటలకు ఆందోళన విరమించారు.