
జాతరకు ప్రత్యామ్నాయ దారులు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం మహాజాతరకు ప్రత్యామ్నాయ దారుల ఏర్పాటునకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈసారి మహాజాతర సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు రవాణా ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ రోడ్ల ఏర్పాట్లను ఆదివారం ఎస్పీ శబరీశ్‌తో కలిసి పరిశీలించారు. గోవిందరావుపేట మండలం మొట్లగూడెం నుంచి ముత్తాపురం మీదుగా తాడ్వాయి మండలం గోనెపల్లి వరకు, కొండపర్తి మీదుగా గోనెపల్లి వరకు, గోనెపల్లి నుంచి మేడారంలోని శివరాంసాగర్ సమీపంలోని వీఐపీ వరకు, వీఐపీ పార్కింగ్ నుంచి చిలకలగుట్ట వరకు రోడ్ల ఏర్పాటును పరిశీలించారు. ఈసారి జాతరకు నూతన రోడ్లు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ తలెత్తకుండా ఉంటుందని భావించారు. కాగా, కొండపర్తి నుంచి ఒకదారి, ముత్తాపురం నుంచి మరో దారి, ఈరెండు దారులు కూడా గోనెపల్లిలో కలిసి జంక్షన్ ఏర్పడనుంది. అక్కడ నుంచి ఈ దారులు ప్రత్యామ్నాయం కానున్నాయి. కాగా, మంత్రి జా తీయ రహదారి నుంచి కొండపర్తి మీదుగా అటవీ మార్గ గుండా గోనెపల్లి వరకు బైక్‌పై సుమారు 3 కిలోమీటర్లు అటవీ మార్గంలో పర్యటించి రోడ్డు ఏర్పాటును పరిశీలించారు. డీఎస్పీ రవీందర్, పస్రా సీఐ దయాకర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి ఉన్నారు.
హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రికి వినతి
మండలంలోని నార్లాపూర్ చెక్ పోస్టు సమీపంలోని కల్వర్టుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని మంత్రి సీతక్కకు నార్లాపూర్ రైతులు ఆదివారం వినతి పత్రం అందజేశారు. కల్వర్టు కింద పైపులు చిన్నగా ఉండడంతో జంపన్నవాగు వరద తాకిడికి కల్వర్టుకు ఇరువైపులా ఉన్న వందలాది ఎకరాల వరి పంట నీటమునిపోతుందని విన్నవించారు. స్పందించిన మంత్రి బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మేడారం జాతర చైర్మన్ అర్రెం లచ్చుపటేల్, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
అటవీ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాట్ల పరిశీలన
బైక్‌పై మూడు కిలోమీటర్ల ప్రయాణం..