
ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా పనులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం గద్దెల ప్రాంగణంలో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పనులు చేపట్టనున్నట్లు పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు తెలిపారు. ఐటీడీఏ అతిథి గృహంలో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ సంఘాల ముఖ్య ప్రతినిధుల సమావేశంలో ఆర్కిటెక్చర్, కోయల పడిగల గుడ్డల లిపి 3నుంచి 7 గొట్ల మూలాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డాలు గుడ్డలో ఉన్న పూర్వ చరిత్ర చిత్రలిపి, ఆదివాసీ జీవన విధానం గోడలపై ఆవిష్కరించాలని సూచించారు. వెయ్యేళ్లు సజీవంగా ఉండేలా, ఆదివాసీల చరిత్ర నిలిచేలా జాతర చరిత్ర బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా గద్దెల ప్రాంగణం, సాలాహారం నిర్మాణంపై ఆదివాసీల బొమ్మలు ఉండాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు. కోయ ద్వారాల మాదిరిగానే ఆలయ ద్వారాల నిర్మాణాలు ఉంటాయని వివరించారు. ద్వారాలపై సమ్మక్క–సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు మూలాలు, ఆదివాసీల గొట్లు, గోత్రాలు, సిద్ధబోయిన వారి పూజావిధాన పద్ధతులు కూడా ఉంటాయని చెప్పారు. మిగిలిన 8 ద్వారాల్లో ఐదో గొట్టు సమ్మక్క, మూడో గొట్టు సారలమ్మ, నాలుగో గొట్టు పగిడిద్దరాజు, గోవిందరాజు, వడ్డె (పూజారి) గోత్రాలతో ప్రత్యేక ద్వారాలు ఏర్పాటు చేయడంతోపాటు ఆ వంశ మూల చరిత్ర ఉంటుందన్నారు. ఆదివాసీ సంస్కృతికి విరుద్ధంగా నిర్మాణాలు ఉండవని స్పష్టం చేశారు. ఆలయంలో ఏర్పాటు చేయనున్న చిత్రాలను కలెక్టర్‌కు పంపించామన్నారు. తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, డాక్టర్ మైపతి అరుణ్ కుమార్, పూజారులు చందా రఘుపతి, సిద్ధబోయిన స్వామి, నర్సింగరావు, సిద్ధబోయిన అరుణ్, కొక్కెర రమేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొప్పుల రవి, ఆదివాసీ నేత ముద్దబోయిన రవి, సమ్మక్క–సారలమ్మ పరిశోధన కేంద్రం సభ్యుడు కోరం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పూజారుల సంఘం అధ్యక్షుడు
సిద్ధబోయిన జగ్గారావు

ఆదివాసీ సంస్కృతి ప్రతిబింబించేలా పనులు