
అనాసక్తి!
వ్యాపారుల
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన మోడల్ కూరగాయల మార్కెట్‌లోకి వెళ్లేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. పనులు పూర్తికాలేదని, గాంధీపార్కులోనే ఉంటామని చాలామంది వ్యాపారులు వాదిస్తున్నారు. అయితే సభలు, సమావేశాలకు ఇబ్బంది అవుతుందని గాంధీపార్కునుంచి కూరగాయల మార్కెట్‌ను తొలగించాలని పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నారు. ఈసమస్య ఇలా ఉంటే పాత బజార్‌లో ఉన్న పాత కల్లు కాంపౌండ్ స్థలంలో కూరగాయాల మార్కెట్ ఏర్పాటు చేయాలని వ్యాపారులు కార్యాలయంలో వినతులు ఇచ్చారు.
లక్ష దాటినా జనాభా..
మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 57,818 మంది ఓటర్లు 68,889 మంది జనాభా ఉంది. కానీ ఉద్యోగం, విద్యా, వ్యాపారం పరంగా మానుకోటలో నివాసం ఉండే వారితో కల్పితే లక్ష జనాభా దాటుతుంది. 25,000లకు పైగా గృహాలు ఉన్నాయి. కాగా చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం హయాంలోనే ఆఫీసర్ క్లబ్ పక్కనే ఉన్న స్థలంలో ఇంటిగ్రేటెడ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయానికి నిధులు కేటాయించి దాదాపు పనులు పూర్తి చేశారు. అయితే ఆ స్థలంలోనే కూరగాయల వ్యాపారులు వ్యాపారం చేసే వారు. ఇంటిగ్రేటెడ్ నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణం వల్ల వారికి గాంధీపార్కులో కేటాయించారు. అప్పటి నుంచి అక్కడే కూరగాయలు విక్రయిస్తున్నారు.
2023లోనే మోడల్ మార్కెట్ ప్రారంభం
మోడల్ మార్కెట్‌ను 30–06–2023లో ప్రారంభించారు. అయితే నేటి వరకు కూరగాయల వ్యాపారులు అందులోకి వెళ్లలేదు. కొన్ని పనులు పెండింగ్‌లో ఉండడంతో స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన రూ.90లక్షలు మంజూరు చేయగా.. అందులో రూ.60లక్షల పనులు పూర్తయ్యాయి. మిగిలిన రూ.30లక్షలతో పార్కింగ్, గేట్లు ఇతర పనులు చేపట్టాల్సి ఉందని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌ను ప్రారంభించి సంవత్సరాలు గడుస్తున్నా వ్యాపారులు వెళ్లకపోవడంతో మందు బాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది.
అనుకూలంగా లేదనే వాదన..
మార్కెట్ తమకు అనుకూలంగా లేదని వ్యాపారులు వాదిస్తున్నారు. దానికి తోడు పనులు కూడా పూర్తి కాలేదని చెబుతున్నారు. దీంతో గాంధీపార్కులోనే వారు తిష్ట వేశారు. అధికారులు మాత్రం పార్కింగ్ గేట్ల పనులు జరుగుతున్నాయని, దీంతో ఎలాంటి ఆటంకం లేదని వ్యాపారులు వెళ్లాలని సూచిస్తున్నారు. కానీ వ్యాపారులు ససేమిరా అంటున్నారు. దీంతో ఆ సమస్య అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.
పలు పార్టీలు ఆధ్వర్యంలో ఆందోళనలు..
గాంధీపార్కు మొదటి నుంచి సభలు, సమావేశాలకు వేదికగా ఉందని వెంటనే కూరగాయల వ్యాపారులను ఖాళీ చేయించి, అభివృద్ధి చేయాలని పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నారు. పలు సంఘాల ఆధ్వర్యంలో ఆపార్కులో అంబేడ్కర్ భవనం నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
తెరపైకి కొత్త సమస్య..
పాత బజార్‌లోని పాత కల్లు కాంపౌండ్ స్థలంలో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయాలని కమిషనర్‌కు వినతులు ఇచ్చారు. కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయకపోతే ఆస్థలం కబ్జా చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులకు విన్నవించారు. కాగా అది గ్రీన్‌ల్యాండ్ కావడంతో ఎలాంటి నిర్మాణాలు చేపట్టే అవకాశం లేదని అధికారులు అంటున్నారు.
పనులన్నీ పూర్తయితేనే..
మోడల్ మార్కెట్‌లో పనులన్నీ పూర్తయితేనే వెళ్తాం. అందరికీ అనుకూలంగా ఏర్పాటు చేయాలి. మార్కెట్ ఎదుట గుమ్చీలు ఏర్పాటు చేయవద్దు. వ్యాపారపరంగా నష్టం లేకుండా చేస్తేనే వెళ్తాం.
–ఎం.వెంకట్రావ్, కూరగాయల మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు
దసరాలోపే తరలిస్తాం
దసరాలోపే కూరగాయల మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌లోకి తరలిస్తాం. దాదాపు పనులు పూర్తి అయ్యాయి. మిగిలిన చిన్న చిన్న పనులతో సమస్య లేదు. వ్యాపారులు మోడల్ మార్కెట్‌లోకి వెళ్లాల్సిందే. వ్యాపారుల కోసమే అది ఏర్పాటు చేశాం. వ్యాపారులు సహకరించాలి.
– రాజేశ్వర్, మానుకోట మున్సిపల్ కమిషనర్