
అటవీ సంపదను కాపాడుకోవాలి
మహబూబాబాద్ రూరల్ : భవిష్యత్ తరాల మనుగడ కోసం అటవీ సంపదను కాపాడుకోవాలని జిల్లా అటవీశాఖ అధికారి విశాల్ బత్తుల అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని మదర్ థెరిస్సా సెంటర్ నుంచి జమాండ్లపల్లి శివారు అటవీశాఖ జిల్లా కార్యాలయం వరకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి అటవీశాఖలో విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరించుకుంటూ నివాళులర్పించారు. డీఎఫ్‌ఓ విశాల్ మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో అడవుల ప్రాముఖ్యతను గురించి జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం తెలియజేస్తుందన్నారు. కార్యక్రమంలో అటవీ మండల అధికారి వెంకటేశ్వర్లు, రేంజ్ అధికారులు, డిప్యూటీ రేంజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.