
ఇబ్బంది లేకుండా పంపిణీ చేయాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
గూడూరు: రైతులకు ఇబ్బంది కలగకుండా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌లో యూరియా నిల్వ, వడ్డెరగూడెం శివారు రైతు వేదిక వద్ద టోకెన్ల కోసం రైతుల క్యూను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి అబ్దుల్‌మాలిక్‌తో యూరియా పంపిణీ, రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యూరియా పంపిణీలో తప్పకుండా పోలీసుల సహకారం తీసుకోవాలని, అందుకు పోలీసులు తప్పక సహకరించాలని సూచించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో పాటు ప్రాథమిక పాఠశాలను, తిరిగి వెళ్లే ముందు బ్రాహ్మణపల్లిలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. మధ్యాహ్నం భోజనం సమయంలో పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ ప్రతీరోజు మెనూ పాటిస్తూ వడ్డిస్తున్నారా, భోజనం రుచికరంగా ఉంటుందా అని విద్యార్థులను అడిగారు. అందుకు పిల్లలు బాగుంటుందని చెప్పడంతో సంతృప్తి చెందారు. అదేవిధంగా సీహెచ్‌సీలో మందులు వివరాలను అడిగి తెలుసుకొని, వైద్యులు అందుబాటులో ఉంటూ సేవలందించాలన్నారు. కేజీబీవీ పరసర ప్రాంతాలను పరిశుభ్రంగా చూసుకోవాలన్నారు. భోజన వసతి, తరగతి గదులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, తహసీల్దార్ నాగభవాని, సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై గిరిధర్‌రెడ్డి పాల్గొన్నారు.