
వృద్ధురాలి దారుణ హత్య..
వెంకటాపురం(కె): వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. మద్యం మత్తులో డబ్బుల కోసం అల్లుడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన ములుగు జిల్లా వెంకటాపురం(కె) మండలం వీఆర్‌కేపురంలో చోటు చేసుకుంది. ఎస్సై తిరుపతిరావు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కొండగొర్ల ఎల్లమ్మ(65) భర్తను వదిలి తల్లిదండ్రులతో కలిసి జీవనం కొనసాగిస్తోంది. ఎల్లమ్మ రోజువారీగా కూలీ పనులు చేసుకుంటూ కొంతమేర డబ్బులు దాచుకుంది. ఈ డబ్బులపై తన అన్న కుమారుడు విజయ్ కన్నేశాడు. మద్యానికి బానిసైన విజయ్.. డబ్బులు, బంగారం కావాలని మూడు రోజులుగా మేనత్త ఎల్లమ్మను అడుగుతుండగా ఆమె నిరాకరిస్తోంది. దీనిపై విజయ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎల్లమ్మ గురువారం ఉదయం ఇప్పలగూడెంలోని కిరాణా షాపునకు వెళ్లొస్తోంది. ఈ సమయంలో మద్యం మత్తులో ఉన్న విజయ్ తనకు డబ్బులు ఇవ్వడం లేదనే కోపంతో ఎల్లమ్మపై గొడ్డలితో దాడికి పాల్పడగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి సోదరి బాడిస దుర్గ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందింతుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కాగా, ఎల్లమ్మ హత్యతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు.
గొడ్డలితో నరికి చంపిన అల్లుడు
మద్యం మత్తులో డబ్బుల కోసం ఘాతుకం
వీఆర్‌కేపురంలో ఘటన