
యూరియా సమస్యపై ఆరా..
సాక్షి, మహబూబాబాద్: మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలు ఎక్కువగా ఉన్న మానుకోట జిల్లాలో రోజుకో సమస్య తలెత్తుతోంది. దీంతో అటు అధికారులకు, ఇటు ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారుతోంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా యూరియా సమస్య ఉన్నప్పటికీ మానుకోటలోనే ఎక్కువ ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈ సమస్యలతోపాటు, ఇతర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు ఎలా ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరా తీసినట్లు తెలిసింది. ఇందుకోసం మంగళవారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లాకు చెందిన పలువురు అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం.
యూరియా సమస్యపై ఆరా..
మానుకోట జిల్లాలో యూరియా సమస్యపై ప్రతీరోజు ఆందోళనలు జరుగుతున్నాయి. కూపన్ల పంపిణీలో గొడవలు, బస్తాలు సక్రమంగా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన, బ్లాక్ మార్కెట్ వంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగడం, కొన్నిచోట్ల ఫర్టిలైజర్ షాపులపై దాడులు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రం అంతటా సమస్య ఉన్నా.. మానుకోటలోనే ఎక్కువ ఆందోళనలు జరగడంతో ముఖ్యమంత్రి, మంత్రి వర్గంలో కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.
ఈ విషయంపై మంగళవారం జరిపిన సమీక్షలో జిల్లాలో సాగు ఎంత, ఎంత మేరకు యూరియా అవసరం.. ఇప్పటి వరకు ఎంత వచ్చింది.. ఎంత రావాలి.. అనే విషయాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. సమస్య సద్దుమణిగే వరకు అంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులతో సున్నితంగా వ్యవహరించి పరిస్థితి చక్కబెట్టాలని సూచించినట్లు సమాచారం. ఇప్పుడు వస్తున్న యూరియాతోపాటు అదనంగా సరఫరా చేసే ప్రయత్నం చేస్తామని, రైతుల్లో నమ్మకం కలిగించేలా వ్యవహరించాలని అధికారులకు చెప్పినట్లు తెలిసింది.