
రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా పంపిణీ చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం యూరియా సరఫరా, స్వచ్ఛ భారత్ కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 25,800 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామన్నారు. యూరియా సమాచారం క్షేత్రస్థాయిలో ముందస్తుగా రైతులకు అందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రతీ కేంద్రంలో రైతులకు కావాల్సిన తాగునీరు, టెంట్లు ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో స్వచ్ఛ భారత్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. శాఖల వారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలన్నారు. అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, నిల్‌కుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.