
సంపులో పడి ఆర్టిజన్ కార్మికుడి మృతి
● కేటీపీపీలో ఘటన
గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూ రు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ ఆర్టిజన్ కార్మికుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం కొంపెల్లి గ్రామానికి చెందిన తూండ్ల సురేశ్(38) కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్ల విద్యుత్ కేంద్రంలో 2017 నుంచి ఆర్టిజ న్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. మంగళవారం యఽథావిధిగా విధులకు హాజరైన సురేశ్.. అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు కాలుజారి బాటమ్ యాష్ సంపులో పడి మృతి చెందాడు. బుధవారం విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న కేటీపీపీ సిబ్బంది.. పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించి మృతదేహాన్ని వెలికితీశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, మృతుడికి భార్య జీవిత, కూతురు సిరివల్లి, కుమారుడు సుజిత్ ఉన్నారు. సురేశ్ మృతితో కేటీపీపీలో విషాదఛాయలు అలుముకున్నాయి.