
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
నర్సంపేట రూరల్: కూలి విషయంలో దంపతుల మధ్య జరిగిన గొడవతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నర్సంపేట మండలం పర్శనాయక్‌తండాలో చోటుచేసుకుంది. ఎస్సై గూడ అరుణ్ ప్రకారం.. తండాకు చెందిన కొర్ర జగన్ (45), జ్యోతి దంపతులు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జ్యోతి గ్రామంలో కొర్ర రవీందర్ వద్దకు మిషన్‌లో మొక్కజొన్నలు పట్టే కూలికి వెళ్తోంది. అయితే ఆ పనికి వెళ్లొద్దని జగన్ ఎంత చెప్పినా జ్యోతి వినకపోవడంతో పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం రవీందర్.. జగన్ ఇంటికొచ్చి జ్యోతిని కూలికి రావాలని కోరాడు. దీనిపై దంపతులు మళ్లీ గొడవ పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన జగన్ గురై ఇంట్లోకెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా ఎస్సై గూడ అరుణ్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సంపేటకు తరలించారు. జగన్ తల్లి సమ్మక్క ఫిర్యాదు మేరకు రవీందర్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
సంగెం: అనారోగ్య సమస్యలతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన బుధవారం ఎల్గూరు, చింతలపల్లి రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం.. సంగెం మండల కేంద్రానికి చెందిన భూపతి నాగరాజు(26) పదేళ్ల నుంచి పక్షవాతం, తల, నడుము నొప్పితో బాధపడుతున్నాడు. పలు ఆస్పత్రులో చికిత్స పొందినా తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెంది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అతడి బంధువులకు అప్పగించినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.