
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..
● తండ్రిని హత్య చేసిన కుమారుడు
● ఈ ఘటనలో కొడుకు అరెస్ట్
● వివరాలు వెల్లడించిన వర్ధన్నపేట ఏసీపీ
వర్ధన్నపేట : తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో తండ్రిని హత్య చేసిన కుమారుడిని అరెస్ట్ చేసినట్లు వర్ధన్నపేట ఏసీపీ ఎ. నర్సయ్య తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. వర్ధన్నపేట మండలం గుబ్టేటి తండాకు చెందిన సపావత్ సురేశ్‌కు 2019లో తాళ్లకుంట తండాకు చెందిన మౌనికతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వివాహం జరిగిన కొద్ది కాలం వరకు కాపురం సాఫీగానే సాగింది. అనంతరం సురేశ్ మద్యానికి బానిపై భార్యతో గొడవ పడుతుండేవాడు. ఈ విషయంపై సురేశ్ తండ్రి ససావత్ రాజు(49) సర్ది చేప్పేవాడు. దీనిపై సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు తండ్రి రాజును కొట్టాడు. ఈ క్రమంలో సురేశ్‌కు ఓ యువతితో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం తెలిసి సురేశ్ భార్య తన పుట్టింటికి వెళ్లింది. ఆగస్టులో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి భార్యను ఇంటికి తీసుకురాగా రాజు.. సురేశ్‌ను మందలించాడు. దీనిపై కోపోద్రికుడైన సురేశ్ తన వివాహేతర సంబంధానికి తండ్రి, భార్య అడ్డుపడుతున్నారని భావించి వారిని అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఇందులో భాగంగా ఈనెల 6న రాత్రి తన భార్య మౌనికతో గొడవ పడుతుండగా రాజు.. సురేశ్‌కు సర్ది చెప్పాలని యత్నించాడు. దీంతో ఇదే అదునుగా భావించిన సురేశ్.. తండ్రి రాజుపై విచక్షణారహితంగా దాడికి పాల్ప డ్డాడు. అనంతరం చీరను మెడకు చుట్టి చంపి పరారయ్యారు. మృతుడి కుమార్తె స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సోమవారం నిందితుడు సురేశ్‌ను వర్ధన్నపేట బస్టాండ్ వద్ద అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, సిబ్బందిని సీపీ సన్‌ప్రీత్ సింగ్ అభినందించారు.
● ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు