
గోదావరి మీదుగా నాటు పడవలో ప్రయాణం..
కాళేశ్వరం: జీవనోపాధి కోసం చేపలు పట్టేందుకు నాటుపడవ కొనుగోలు చేసిన ఇద్దరు మత్స్యకారులు ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అధికం అవుతాయని భావించారు. అదే గోదావరి మీదుగా తమకు తెలిసిన విద్యనే కదా అని మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచకు నడుపుతూ ప్రయాణం సాగించారు. దారి మద్యలో అన్నారం బ్యారేజీ వద్ద 11 పియర్‌కు తట్టుకొని ప్రవాహంలో పడవ బోల్తాపడడంతో ఒకరు గల్లంతు కాగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన జయశంకర్‌భూపాలపల్లి–మంచిర్యాల జిల్లాల మధ్యలో గోదావరిపై నిర్మించిన అన్నారం బ్యారేజీలో సోమవారం జరిగింది. చెన్నూర్ సీఐ దేవేందర్ తెలిపివ వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ సమీపంలో మండలపురానికి చెందిన ఇద్దరు మత్స్యకారులు గడ్డం వెంకటేష్(46), తూముకూరి కృష్ణస్వామిలు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం పొక్కూర్‌లో చొంక సంపత్ వద్ద నాటు పడవ కొనుగోలు చేశారు. అక్కడ ఓ టాటాఏస్‌ను కిరాయి నిమిత్తం అడుగగా అధికంగా చెప్పడంతో..చేసేదేమి లేక అదే గోదావరిపై నాటుపడవను నడుపుకుంటూ అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకున్నారు. సుందరశాలౖవైపు బ్యారేజీలోని 11వ పియర్ వద్ద ప్రవాహం అధికంగా కొనసాగుతుండడంతో అందులోంచి బయటకు దాటే క్రమంలో పడవ బోల్తాపడి వెంకటేష్ గల్లంతయ్యాడు. కృష్ణస్వామి ఈతకొడుతు దరికి చేరి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో గల్లంతైన వెంకటేష్ కోసం పోలీసులు, జాలర్లు, కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సీఐ వివరించారు. గల్లంతైన వ్యక్తి అవసరాల కోసమే నాటుపడవ కొనుగోలు చేశారు. అతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. కాగా, అన్నారం బ్యారేజీ పియర్ వద్ద నాటుపడవ బోల్తాపడ్డ విషయం జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
నిఘా లేకనే..
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బ్యారేజీలపై ఇరిగేషన్‌శాఖ నిఘా, పర్యవేక్షణ లోపించింది. అన్నారం బ్యారేజీ గుండా గోదావరి మీదుగా గేట్ల మధ్యనుంచి నాటు పడవ సాయంతో బయటకు దాటేందుకు సాహసం చేసి ఒకరు గల్లంతయ్యే ఘటన చోటు చేసుకున్నా పట్టింపులేనితనం కొట్టచ్చినట్లు కనిపిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. సోమవారం సుమారుగా 52వేల క్యూసెక్కుల ప్రవాహం తరలి దిగువకు కాళేశ్వరం వైపునకు వెళ్తోంది.
అన్నారం బ్యారేజీ 11వ గేటు వద్ద పియర్‌ను తాకి పడవ బోల్తా
ఒకరి గల్లంతు..మరొకరు సురక్షితంగా బయటకు..
పడవ కొనుగోలు చేసి ప్రయాణం చేసిన ఇద్దరు మత్స్యకారులు
ఇద్దరు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచ వాసులు
గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్న జాలర్లు, పోలీసులు

గోదావరి మీదుగా నాటు పడవలో ప్రయాణం..