
సంవత్సరీకానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి..
నెల్లికుదురు: తన బంధువు సంవత్సరీకం కార్యక్రమానికి వెళ్లొస్తూ ఓ వ్యక్తి మృత్యుఒడికి చేరాడు. బైక్ అదుపు తప్పిన ఘటనలో దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని బ్రాహ్మణకొత్తపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై చిర్ర రమేశ్ బాబు కథనం ప్రకారం.. ఇనుగుర్తి మండలం కోమటిపల్లికి చెందిన ఆరెందుల సత్యనారాయణ (56) బైక్‌పై గార్ల గ్రామంలోని తన బంధువు సంవత్సరికం కార్యక్రమానికి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి శివారులో బైక్ అదుపు తప్పడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108లో మహబూబాబాద్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ఆరెందుల ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్ అదుపు తప్పి వ్యక్తి దుర్మరణం