
మల్లన్నగండి కుడి కాల్వ నిర్మాణం అద్భుతం
స్టేషన్‌ఘన్‌పూర్: గండి రామారం (మల్లన్నగండి) కుడి కాల్వ నిర్మాణం అద్భుతమని, గుట్టల నుంచి సైతం కాల్వలు తీయొచ్చు.. గోదావరి జలాలు పా రించొచ్చు.. పంటపొలాలు పండించొచ్చని నిరూపితమైందని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎమ్మెల్యే కడియం ప్రత్యేక చొరవతో రూ.29 కోట్ల వ్యయంతో మండలంలోని మీది కొండ శివారులో 11 గ్రామాల్లో 5,600 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన మల్లన్నగండి కుడి కాల్వను ఎంపీ డాక్టర్ కావ్యతో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్‌డీఓ వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఉమ్మ డి వరంగల్ జిల్లాలో ఎత్తైన, కరువు ప్రాంతాలు జనగామ, చేర్యాల, వర్ధన్నపేట, పాలకుర్తి తదితర ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో 2003లో దేవాదుల మొదటి దశ పనులు ప్రారంభించామన్నారు. నాడు దేవాదుల పేరుతో కడియం డ్రామా ఆడుతున్నారని, దేవాదుల దేవతలకే సాధ్యం కాదని పలువురు విమర్శలు చేశారని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం కాల్వలో పారుతున్న నీరు చూస్తే వారికి జ్ఞానోదయం అవుతుందన్నారు.
రూ.1,015 కోట్ల ప్యాకేజీతో
పలు పనులకు ఆమోదం
దేవాదుల మూడో దశ 6వ ప్యాకేజీ ద్వారా నాలుగు నియోజకవర్గాల్లో 78వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే సవరించిన అంచనాలతో రూ.1,015 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపారని ఎమ్మెల్యే కడియం చెప్పారు. ఏడాది లోపు పనులు పూర్తి చేయిస్తానన్నారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదిన్నరలోనే రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు. రాజకీయ జన్మనిచ్చిన నియోజకవర్గ అభివృద్ధికి తన చివరి శ్వాస వరకు కృషి చేస్తానన్నారు.
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కడియం..
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవజ్ఞులైన స్థానిక ఎమ్మె ల్యే కడియం శ్రీహరి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని, ఎడారి వంటి వాతావరణంలో జీవిస్తున్న రైతుల సంక్షేమం కోసం భారీ ఎత్తున నీటిని విడుదల చేయడం చారిత్రక ఘట్టమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాంబాబు, ఏఎంసీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, కరుణాకర్, చిల్పూరు దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, మాజీ వైస్ ఎంపీపీ చల్లా సుధీర్‌రెడ్డి, నాయకులు రాపోలు మధుసూదన్‌రెడ్డి, నాగరబోయిన యాదగిరి, వెంకటేశ్వర్‌రెడ్డి, నాగరబోయిన శ్రీరాములు, కొలిపాక సతీశ్, ఈఈ వినయ్, డీఈ సంపత్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఎమ్మెల్యే కడియం
ఎంపీ డాక్టర్ కడియం కావ్య

మల్లన్నగండి కుడి కాల్వ నిర్మాణం అద్భుతం