
కాకతీయుల కళాసంపద అద్భుతం
గణపురం: కాకతీయుల కళాసంపద అద్భుతమని శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్ కే రెడ్డి, బ్రూనైలో భారత హైకమిషనర్ రాము అబ్బగాని (ఐఎఫ్‌ఎస్ అధికారులు) కొనియాడారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలకంటి నాగరాజు వారికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ విశిష్టతను వారికి వివరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయుల ఆలయ నిర్మాణ విధానం, వారు ఏర్పాటు చేసిన శిల్ప సంపద అద్భుతమన్నారు. ఈ శిల్ప సంపదను భావి తరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ ఎల్. భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల, ప్రాథమిక
ఆరోగ్య కేంద్రాల పరిశీలన
కోటగుళ్ల పరిశీలనతోపాటు మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పదోతరగతి విధ్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు నిరంతరం సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం చెల్పూరులో నిర్వహిస్తున్న మిల్లెట్ యూనిట్‌ను సందర్శించారు. మిల్లెట్ తయారీ ప్రక్రియను పరిశీలించారు. ఈ యూనిట్ దేశ వ్యాప్తంగా బ్రాండ్‌గా తీర్చిదిద్దాలని సూచించారు.
టస్సార్ పట్టు వస్త్రాల నిర్వహణకు చర్యలు
కాళేశ్వరం: టస్సార్ పట్టు వస్త్రాలు, వ్యాపారాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని శాన్‌ఫ్రాన్సిస్కో, బ్రూనై దౌత్య కార్యాలయాల అధికారులు శ్రీకర్ కే రెడ్డి, రాము అబ్బగాని తెలిపారు. బుధవారం మహదేవపూర్‌లోని టస్సార్ కాలనీలో పట్టు వస్త్రాలు నేస్తున్న ప్రక్రియను కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పరిశీలించారు. పట్టు గుడ్ల నుంచి దారం తీస్తున్న తీరు, వస్త్రాలు నేస్తున్న విధానాన్ని చూసి అభినందించారు. వ్యాపారం ఎలా ఉంటుందని నేత కార్మికుడు గొర్రె బాబును అడిగి తెలుసుకున్నారు. కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, అధికారులు ఉన్నారు.
శాన్‌ఫ్రాన్సిస్కో, బ్రూనైలో భారత కాన్సుల్ బృందం కితాబు
కలెక్టర్‌తో కలిసి కోటగుళ్ల సందర్శన

కాకతీయుల కళాసంపద అద్భుతం