
ఆశాజనకంగా వరి సాగు
సాక్షి, మహబూబాబాద్:
వానాకాలం సీజన్ ప్రారంభంలో వర్షాలు దోబూచులాడాయి. దీంతో వరి సాగుపై సందిగ్ధంగా ఉన్న రైతులు.. తర్వాత వర్షాలు కురుస్తున్న కొద్దీ సాగులో వేగం పెంచారు. మొదట ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో వార్షిక ప్రణాళిక లక్ష్యంలో సగం కూడా పంట సాగయ్యే అవకాశం లేదని అధికారులు భావించారు. అయితే జూలై మూడో వారం నుంచి ఆగస్టు వరకు అంతా తారుమారైంది. వరి సాగులో వెనక్కి తగ్గకుండా రైతులు లక్ష్యానికి చేరువయ్యారు.
మందకొడిగా మొదలు..
ఈ ఏడాది జూన్‌లో సరిగా వర్షాలు పడలేదు. దీంతో వరి సాగుచేసే రైతులు నార్లు ఆలస్యంగా పోసుకున్నారు. జూలై మొదటి వారం వరకు కూడా ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీనికి తోడు గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 157 చెరువులు, కుంటలు తెగిపోయాయి. ఈ పరిస్థితిలో సరైన వర్షం పడకపోవతే ఇబ్బంది అవుతుందని రైతులు వరి సాగుకు వెనకడుగు వేశారు. బావులు, బోర్ల కింద మాత్రమే కొంతమేరకు సాగుచేశారు. ఇలా జిల్లాలో వరి సాగు అంచనా 2,21,282 ఎకరాలు ఉండగా.. జూలై మొదటి వారం వరకు 70వేల ఎకరాల్లో కూడా సాగు చేయలేదు. ఈ పరిస్థితిలో వరికి బదులు ఏ పంట సాగు చేయాలని రైతులు ఆలోచించారు. తర్వాత జూలై మూడో వారంలో మోస్తరు వర్షాలు కురిశాయి. అప్పుడు వ్యవసాయశాస్త్రవేత్తలు దీర్ఘకాలిక వంగడాలు కాకుండా స్వల్పకాలిక వంగడాలు సాగు చేసుకోవాలని సూచించారు. ఈక్రమంలో ఆగస్టు నెల ఆరంభం నుంచి వర్షాలు జోరందుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో 2,10,676 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ వారం రోజుల్లో మరో 10వేల ఎకరాల్లో సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే ఆలస్యంగా సాగు మొదలైనా రైతులు అంచనాకు చేరువలోకి వరి సాగును తీసుకొ చ్చారు. అదే విధంగా మిర్చి పంట 52,249 ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేయగా ఇప్పటి వరకు కేవలం 2,327 ఎకరాల్లోనే సాగుచేశారు. అయితే మిర్చి నార్లుపోసి అదునుకోసం ఎదురు చూస్తూ ఆలస్యమైంది. ప్రస్తుతం కురిసిన వర్షాలతో సాగు వేగం పుంజుకుంది.
మరో పంట వేయలేక..
తొలుత వర్షాభావ పరిస్థితులతో పత్తి సాగు అంచనా 84,854 ఎకరాలు ఉండగా 82,539 ఎకరాల్లోనే సాగు చేశారు. అదే మొక్కజొన్న మాత్రం 58,361 ఎకరాలు సాగుచేస్తారని అంచనా వేయగా అంచనాకు మించి 62,021ఎకరాల్లో సాగుచేశారు. వరి విషయానికొస్తే 2,21,282 సాగు అంచనా ఉండగా ఆగుతూ సాగుతూ.. 2,10,676 ఎకరాలకు చేరింది. మిగిలిన పదివేల ఎకరాల్లో కూడా ఇంకా సాగుచేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అంటే వరి సాగుచేసే రైతులు మరో పంట వేసేందుకు వెనకడుగు వేశారు. కష్టమైనా.. నష్టమైనా వరి సాగే చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. కూలీల కొరత, కుటుంబ అవసరాలు, సన్నధాన్యం వేస్తే అదనంగా క్వింటాకు రూ. 500 బోనస్ వస్తుందనే నమ్మకం, సమృద్ధిగా నీటి వనరులు ఉండటం మొదలైన కారణాలతోనే వరి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు 70శాతానికి మించి సన్నరకం వంగడాలే సాగు చేయడం గమనార్హం. ఆలస్యంగా సాగు మొదలైనా ఈ ఏడాది 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
వరి సాగు (ఎకరాల్లో)
అంచనాకు చేరువలో సేద్యం
ఆలస్యంగా వర్షాలు
కురిసినప్పటికీ ఆగని సాగు
ఇబ్బందులెదురైనా వరిపై రైతులకు
తగ్గని మోజు
4లక్షల టన్నులకుపైగా దిగుబడి అంచనా
పంటల సాగు వివరాలు(ఎకరాలు)
పంట అంచనా సాగు
వరి 2,21,282 2,10,676
మొక్కజొన్న 58,361 62,021
పత్తి 84,854 82,539
మిర్చి 52,249 2,327
పెసర 4,555 1,614
పసుపు 00 150
బొబ్బెర్లు 00 10
మినుములు 00 38
మొత్తం 4,21,301 3,59,775
2,10,676