
భద్రతా వైఫల్యం!
మహబూబాబాద్: అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో బాలసదనాల సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాల సదనం నుంచి నలుగురు బాలికలు పరార్ కావడమే ఇందుకు నిదర్శనం. కాగా బాలికలకు భద్రత లేదని తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా చాలా సందర్భాల్లో బాలికలు పరారయ్యారు. అయినా సిబ్బంది తీరులో ఎలాంటి మార్పురావడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపడితే బాల సదనం నిర్వహణలో మార్పు వచ్చే అవకాశం ఉంది.
జిల్లాలో రెండు బాల సదనాలు..
జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పరిధిలో రెండు బాల సదనాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో బాలబాలికలకు వేర్వేరుగా బాలసదనా లు ఉన్నాయి. అలాగే జిల్లా కేంద్రంలో దైవ కృప అనే ప్రైవేట్ ఆశ్రమం ఉండగా.. అక్కడ 17 మంది బాలురు ఉన్నారు. ఆశాభవన్‌లో 19 మంది బాలు రు, తొర్రూరులోని స్నేహనివాస్‌లో 39 మంది బాలికలు ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనంలో 22 మంది ఉన్నారు. ఇందులో 20 మంది పాఠశాలలకు వెళ్తున్నారు. బాలుర బాలసదనంలో 29 మంది ఉన్నారు. అవి రెండు కూడా అన్ని వసతులు ఉన్న ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వాటిలో సూపరింటెండెంట్, మ్యాట్రిన్, చైల్డ్‌వెల్ఫేర్ అధికారి, సూపర్‌వైజర్, కేస్‌వర్కర్, కేస్ టేకర్, కుక్, అటెండర్, నైట్ వాచ్‌మెన్ ఉండాలి. కాగా బాలికల బాలసదనంలో నైట్ వాచ్‌మెన్, కేస్ వర్కర్, కేస్ ట్రేకర్ మాత్రమే లేరు మిగతా సిబ్బంది ఉన్నారు. అలాగే బాలుర బాలసదనంలో పూర్తిస్థాయి సిబ్బంది ఉన్నారు.
18 సంవత్సరాల్లోపు పిల్లల కోసమే..
18 సంవత్సరాలలోపు పిల్లల కోసమే ప్రభుత్వం బాలసదనాలు ఏర్పాటు చేసింది. లక్షల వేతనాలు చెల్లిస్తూ సిబ్బందిని భర్తీ చేసింది. బాలసదనాల్లో అన్ని వసతులు కల్పించింది. తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదరికంలో ఉన్నవారు, తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, బాల్యవివాహాలు చేసుకున్న వారు, రిస్క్ చేసిన పిల్లలకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
నలుగురు పిల్లలు పరార్..
జిల్లా కేంద్రంలోని బాలికల బాలసదనం నుంచి ఆగస్టు 27న రాత్రి 11.16 గంటలకు నలుగురు బాలికలు పరారయ్యారు. ఈమేరకు బాలసదనం సిబ్బంది 28వ తేదీన టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేశారు. వెంటనే పోలీసులు స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఆ నలుగురిలో ఇద్దరిని వరంగల్‌లో పట్టుకున్నట్లు సమాచారం. మిగిలిన ఇద్దరు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
గతంలోనూ ఘటనలు..
బాలికల బాలసదనంలో గతంలోనూ బాలికలు పరారైన ఘటనలు ఉన్నాయి. ఏటా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. భద్రత విషయంలో అధికారులు పెద్దగా దృష్టిపెట్టడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కాగా బాలికలు అటెండర్‌పై చేయి చేసుకుని తాళాలు పగులకొట్టి పరారైనట్లు సమాచారం. కాగా భత్రను పటిష్టం చేయకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి.
తీసుకొచ్చిన వారికి కౌన్సెలింగ్..
బాలసదనం నుంచి పారిపోయిన వారిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులు ఉంటే అప్పగించడం, వారు స్పందించకుంటే అక్కడే ఉంచుకుని వారికి ఒకేషనల్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించడం, ఓపెన్ టెన్త్, ఇంటర్, డిగ్రీ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బాల సదనం నుంచి
నలుగురు బాలికలు పరార్
అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఇష్టారాజ్యం
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పటికీ మారని సిబ్బంది తీరు