
విద్యాసామర్థ్యాల పెంపే లక్ష్యం
● నేటి నుంచి ఈనెల 15వరకు పఠనోత్సవం
● విద్యార్థుల అక్షరపునాదికి చర్యలు
● రోజుకు 30నిమిషాల పాటు
పఠనానికి కేటాయింపు
మహబూబాబాద్ అర్బన్: సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంచేందుకు విద్యాశాఖ అధికారులు నడుం బిగించారు. ముఖ్యంగా విద్యార్థులు చదవడం అలవాటు చేసుకోవడమే లక్ష్యంగా పఠనోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి విద్యార్థులు సరళ పదాలు, గుణిత పదాలు చదవడం, 2వ తరగతి విద్యార్థులు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు, వాక్యాలను ధారళంగా చదవగలడం, 3 నుంచి ఆపై తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్ట్‌లకు చెందిన పాఠ్యాంశాలతో పాటు వారి స్థాయికి తగిన బాల సాహిత్యాన్ని, దిన పత్రికలను చదివేలా పఠనోత్సవ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించనుండగా.. ఈనెల 15న ముగియనుంది.
నిరుపేద విద్యార్థులే...
ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధికంగా నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే చదువుతున్నారు. వసతులు, ఇతర కారణాలతో చదువులో పట్టు సాధించలేకపోతున్నారు. ఉన్నతస్థాయిలో చాలా మంది విద్యార్థులు చదవడం, రాయడంలో తబడుతున్నారు. తరచూ విద్యార్థులు బడికి గైర్హాజరు కావడం కూడా ఇందుకు కారణమవుతోంది. దీంతో విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు కరువవుతున్నాయి. ఈనేపథ్యంలో విద్యార్థులకు విషయ పరిజ్ఞానాన్ని అందించి ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఈ విద్యా సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం కార్యక్రమం రూపకల్పన చేశారు.
అభ్యసనాభివృద్ధి..
జిల్లాలో 898 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలు 8, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ స్కూళ్లు 4, తెలంగాణ ట్రైబల్ గురుకుల పాఠశాలలు 7, గిరిజన ఆశ్రమ పాఠశాలలు 22, మైనారిటీ గురుకుల పాఠశాలలు 3, కేజీబీవీలు 15, ఒక కేంద్రియ విద్యాలయం ఉంది. ఆయా పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు సుమారు 96,386 వేల మంది చదువుతున్నారు. రోజు పుస్తక పఠనోత్సవం కోసం ప్రతీ తరగతికి 30 నిమిషాలు కేటాయించాల్సిదే. పిల్లలు ధారళంగా చదివేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి. తరగతి ఏదైనా.. విషయం ఏదైనా బోధిస్తున్న ఉపాధ్యాయుడు బోధన అంశాలకు సంబంధించి ప్రాథమిక పరిజ్ఞానాన్ని పిల్లలు అందరూ చదువుతున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించి బోధించిన పాఠ్యాంశాన్ని 10 నిమిషాల పాటు ఒక్కొక్క విద్యార్థ్ధితో చదివించి, కీలక పదాలను గుర్తించి బోర్డు చార్టుపై రాయించాలి. తద్వారా పిల్లలకు చదవడం అలవాటుగా మారే విధంగా చూడాలి. మరో వ్యూహంలో గ్రంథాలయ పుస్తకాలను పిల్లలతో చదివించాల్సి ఉంటుంది. ప్రతీరోజు ప్రతీ తరగతికి గ్రంథాలయ పుస్తకాలు చదవడానికి 30 నిమిషాలు కేటాయించాలి. గ్రంథాలయంలో మూడు రోజుల్లో తెలుగు, హిందీ, ఉర్దూలోని కథల పుస్తకాలు చదివించాలి. ఇలా ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో రాయడం, చదవడం, లెక్కలు చేయడం వంటి సామర్థ్యాలను పెంచాలి. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.
ప్రతీ పాఠశాలలో
పఠనోత్సవం నిర్వహించాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ప్రతీ విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు సెప్టెంబర్ 1 నుంచి 15వ తేదీ వరకు పఠనోత్సవం ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు గ్రంథాలయాల్లో పుస్తకాలు, కథలు, దిన పత్రికలను విద్యార్థులతో చదివించాలి. అన్ని సబ్జెక్ట్‌లు ధారళంగా చదివేవిధంగా విద్యార్థులను తయారు చేయాలి. నిర్ణీత గడువులోగా విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కార్యక్రమంపై పర్యవేక్షణ చేస్తున్నాం.
– దక్షిణామూర్తి, డీఈఓ

విద్యాసామర్థ్యాల పెంపే లక్ష్యం