
ఐక్య పోరాటాలతోనే కార్మిక హక్కుల రక్షణ
తొర్రూరు: ఐక్య పోరాటాలతోనే కార్మికుల హక్కుల పరిరక్షణ సాధ్యమని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షుడు కె. సూర్యం అన్నారు. డివిజన్ కేంద్రంలో టీయూసీఐ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి రవి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో సూర్యం మాట్లాడారు. ప్రధాని మోదీ కార్మిక చట్టాలను రద్దు చేసి కోట్లాది కార్మికుల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల శ్రమ శక్తిని దోచుకుంటూ మతవిద్వేషాలతో కూడిన రాజకీయం చేస్తుందన్నారు. కనీస వేతనాల జీఓను అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. కార్మికుల క్రమబద్ధీకరణ విషయంలోనూ నిర్లక్ష్యం చేస్తోందన్నారు. పనిగంటలను పెంచి కార్మికుల శ్రమను దోచుకుంటుందన్నారు. లక్షలాది కార్మికులకు పీఎఫ్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో సంఘ కార్యదర్శి బిల్లకంటి సూర్యం, నాయకులు జక్కుల యాకయ్య, శ్రీరాం పుల్లయ్య, అర్వపల్లి వెంకన్న, పాడ్య భీకు, వేర్పుల మహేందర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.