
గుడ్ల సరఫరా టెండర్‌పై కసరత్తు
దరఖాస్తుల వెరిఫికేషన్..
దరఖాస్తు ప్రక్రియ పూర్తి
● కొనసాగుతున్న డాక్యుమెంట్ వెరిఫికేషన్
● కాంట్రాక్ట్ కాలపరిమితి ఏడాది
మహబూబాబాద్: జిల్లాలో గుడ్లు సరఫరా చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. కాగా, ఈ సారి అన్ని ప్రభుత్వ శాఖలకు ఒకే కాంట్రాక్టర్ గుడ్లు సరఫరా చేసేవిధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తయి, వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. ప్రతీ నెల 15 లక్షల గుడ్లు సరఫరా చేయనున్నారు.
అన్నింటికీ ఒక్కరే..
జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ హస్టళ్లకు ఒక్కరే కాంట్రాక్టర్‌ను ఎంపిక చేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. గతంలో శాఖల వారీగా కాంట్రాక్టర్లు ఉండే వారు. అది కూడా ఆ శాఖల ఉన్నతాధికారుల హెడ్ ఆఫీస్‌లోనే కాంట్రాక్టర్ల ఎంపిక జరిగేది. ప్రస్తుతం ఆవిధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. కాగా గత నెల 30నుంచి ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఇచ్చింది. కాగా జిల్లాలో కోళ్లఫాంల యజమానులు ఆరుగురు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
అంగన్‌వాడీ కేంద్రాలకే 2,50,000 గుడ్లు..
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 1,435 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆ కేంద్రాల్లో జీరో నుంచి ఆరు నెలలోపు పిల్లలు 3,604 మంది ఉండగా.. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాల లోపు పిల్లలు 20,295మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు 16,181 మంది ఉన్నారు. కేంద్రాల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు (ప్రీస్కూల్), గర్భిణులు, బాలింతలకు రోజు గుడ్డు ఇస్తున్నారు. ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలోపు పిల్లలకు మాత్రం (టీహెచ్‌ఆర్ కింద) ప్రతీ నెల 16గడ్లు ఇస్తున్నారు. కాగా ప్రతీ నెల కేంద్రాలకు సుమారు 2,50,000 గుడ్లు కాంట్రాక్టర్ సరఫరా చేస్తున్నాడు. ఈనెల వరకు పాత కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. మూడు సంవత్సరాల నుంచి ఒక్క కాంట్రాక్టరే సరఫరా చేస్తున్నాడు.
కమిటీలోనలుగురు సభ్యులు..
టెండర్‌కు సంబంధించిన కమిటీలో జిల్లా సంక్షేమాధికారి, డీఈఓ, బీసీ వెల్ఫేర్ అధికారితో పాటు మరొకరు సభ్యులుగా ఉన్నారని అధికారులు తెలిపారు. అంతా పూర్తయిన తర్వాత ఫైనాన్స్ బిడ్ కలెక్టర్ సమక్షంలో ఎంపిక చేసి ఫిజికల్ వెరిఫికేషన్ తర్వాత కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణ పూర్తయి ఈనెల 13నుంచి డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. అన్ని శాఖలకు సంబంధించి జిల్లా సంక్షేమశాఖ కార్యాలయంలో ప్రాసెస్ కొనసాగుతోంది. కాంట్రాక్టర్ ఎంపిక కలెక్టర్ సమక్షంలో జరుగుతుందని అధికారులు తెలిపారు.