
హత్య కేసులో వ్యక్తి అరెస్ట్..
● మహిళ మిస్సింగ్ కేసును ఛేదించిన పోలీసులు
కాళేశ్వరం: ఓ మహిళను హత్య చేసి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్సై పవన్‌కుమార్ శనివారం తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఈ ఏడాది జనవరి 1వ తేదీన మహదేవపూర్ మండలం అంబట్‌పల్లికి చెందిన ఒల్లాల రవికుమార్ తన తల్లి భాగ్యలక్ష్మి (51) గతేడాది డిసెంబర్ 27 నుంచి కనిపించడం లేదని మహదేవపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, భాగ్యలక్ష్మి వద్ద డబ్బులు ఉన్నట్లు మల్హర్ మండలం వల్లంకుంట గ్రామానికి చెందిన వెన్నపురెడ్డి రామయ్య అలియాస్ రాంరెడ్డి గమనించాడు. ఈ క్రమంలో సదరు మహిళను నమ్మించి భూపాలపల్లి దగ్గరలోని కమలాపూర్ ఎక్స్ రోడ్ నుంచి కొద్ది దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు. ఎలాంటి ఆధారం లేకుండా మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతుండగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో క్లూస్ టీమ్ ఆధారాల మేరకు సెల్ ఫోన్ సిగ్నల్, కాల్ డేటా, సీసీ కెమెరాలు పరిశీలించి శనివారం రాంరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఎస్సై శశాంక్ పాల్గొన్నారు.