
రికవరీ చేయట్లే!
ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగినట్లు సోషల్ ఆడిట్ ద్వారా నిర్ధారణ
సాక్షి, మహబూబాబాద్: గ్రామీణ ప్రాంత పేదలకు పని కల్పించడమే ధ్యేయంగా కేంద్రం ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తోంది. అయితే పనుల్లో జరిగిన అవకతవలపై సోషల్ ఆడిట్ నిర్వహించిన అధికారులు దుర్వినియోగమైన నిధుల రికవరీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నానరు. కాగా అక్రమార్కులకు పలువురు అధికారుల అండదండలు ఉన్నాయని, అందుకే రికవరీ చేయడం లేదనే విమర్శలు వస్తున్నారు.
ఏడాదిలో రూ.65లక్షల అవకతవకలు
గడిచిన ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో చేపట్టిన పనుల్లో రూ. 65లక్షల అవకతవకలు జరిగినట్లు తేలింది. జిల్లా వ్యాప్తంగా 1,41,774 కుటుంబాలు జాబ్‌కార్డు ద్వారా 2,51,040 మంది కూలీలు పనులు చేస్తున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 60శాతం కూలీలు, 40శాతం మెటీరియల్ నిష్పత్తిన రూ. 88.14కోట్ల విలువచేసే కూలీ పనులు, రూ. 39.82కోట్లు విలువచేసే మెటీరియల్ పనులు చేశారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే ప్రతీ మండలంలోని ఎంపిక చేసిన గ్రామాల్లో పనుల తీరు, నిధుల వినియోగంపై సోషల్ ఆడిట్ టీమ్ పర్యటించింది. గ్రామ సభలు పెట్టి నివేదికను చదివారు. అయితే ఇందులో ఫీల్ట్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఏపీఓ, ఎంపీడీఓ వరకు అక్రమాలకు సోషల్ ఆడిట్‌లో తేలింది.
అక్రమార్కులకు అండగా..
ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై నిజానిజాలు తేల్చాల్సిన కొందరు అధికారులు సదరు ఉద్యోగులు ఎలాంటి తప్పులు చేయలేదని నిర్ధారించారు. ఇందుకోసం అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకున్న విషయంపై జిల్లాలో చర్చగా మారింది. ఈ విషయంపై ఓ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు సదరు అధికారిపై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం. అదే విధంగా మరికొన్న గ్రామాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు చట్టసభలకు ఎన్నికై న నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చినట్లు విమర్శలు ఉన్నాయి.
వెనకడుగు..
సోషల్ ఆడిట్ టీమ్ ఇచ్చిన నివేదిక ప్రకారం అవకతవకలకు పాల్పడిన బాధ్యుల నుంచి డబ్బులు రికవరీ చేయించాలి. కానీ జిల్లా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో నిర్వహించిన సోషల్ అడిట్ ద్వారా రూ. 65,63,732 రికవరీకి రాశారు. ఇందులో ఇప్పటి వరకు రూ.3,98,959 మాత్రమే రికవరీ చేయగా.. రూ.61,55,773 రికవరీ చేయించాల్సి ఉంది. ఇందులో అత్యధికంగా కొత్తగూడ మండలంలో రూ.6,32,000 ఉండగా.. రూ.65,200 మాత్రమే రికవరీ చేశారు. అదే విధంగా నర్సింహులపేట మండలంలో రూ.6,15,378కి గాను రూ.15,100, మహబూబాబాద్ మండలంలో రూ. 6,10,542గానూ రూ.11,666 మాత్రమే రికవరీ చేశారు.
రికవరీ వేగవంతం చేస్తాం
ఉపాధి హమీ పథకంలో పనుల నిర్వహణ, నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు సోషల్ ఆడిట్ చేసేందుకు ప్రత్యేక టీమ్ ఉంటుంది. వారు నిర్ధారించిన అవకతవకల డబ్బుల రికవరీలో పలు కారణాలతో జాప్యం జరిగింది. తిరిగి వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. –మధుసూదన్ రాజు, డీఆర్‌డీఓ
ఉద్యోగుల వారీగా చేయాల్సిన రికవరీ
హోదా పెండింగ్ రికవరీ
ఫీల్డ్ అసిస్టెంట్ రూ. 10,79,245
పంచాయతీ సెక్రటరీ రూ. 11,19,245
టెక్నికల్ అసిస్టెంట్ రూ. 11,24,245
ఇంజనీరింగ్ విభాగం రూ. 10,74,245
కంప్యూటర్ ఆపరేటర్ రూ. 8,79,396
ఏపీఓ రూ. 4,39,698
ఎంపీఓ రూ. 4,39,698
మొత్తం రూ.61,55,772
అక్రమార్కులకు అండగా పలువురు అధికారుల
చర్యలు తీసుకోకపోవడంతో
సిబ్బంది ఇష్టారాజ్యం

రికవరీ చేయట్లే!