
కేయూలో ఉద్రిక్తత
కామన్ మెస్‌లో విద్యార్థుల ఆందోళన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో కామన్ మెస్ వద్ద విద్యార్థులు మంగళవారం ఆందోళనకు దిగారు. కామన్‌మెస్‌లో వంటచేసేందుకు లారీలో 13టన్నుల లోడ్ కట్టెలు రావాల్సిండగా ట్రాక్టర్‌లో తక్కువగా తీసుకురావడంతో మెస్ కమిటీ బాధ్యులు ప్రశ్నించారు. లారీలో 12నుంచి 13టన్నులు రావాల్సిన కట్టెలను ట్రాక్టర్‌లో తక్కువగా ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. ఈసందర్భంగా సంబంధిత సిబ్బందితోనూ, అక్కడున్న కేర్‌టేకర్‌తోనూ వాగ్వాదానికి దిగారు. జాయింట్ డైరెక్టర్ అక్కడికి చేరుకోగా డైరెక్టర్ రావాలని డిమాండ్ చేశారు. దీంతో సమాచారం అందుకున్న కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎల్‌పీ రాజ్‌కుమార్ కామన్ మెస్ వద్దకు చేరుకోగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. లారీలోడ్‌కు బదులుగా సంబంధిత కాంట్రాక్టర్ ట్రాక్టర్‌లో కట్టెలు పంపారని ఇలా మిగతా వాటిల్లోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. కూరగాయలు సరఫరా చేసేవారు కూడా తక్కువగానే తీసుకొస్తున్నారని, భోజనం నాణ్యతగా ఉండటంలేదన్నారు. కామన్ మెస్‌లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ మెస్ కమిటీ బాధ్యులు పలువురు, విద్యార్థులు హాస్టళ్ల డెరెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. హాస్టళ్ల నిర్వహణకు కమిటీ కూడా ఉంటుందని వీసీ, రిజిస్ట్రార్ వద్దకు వచ్చి మాట్లాడాలని మెస్ కమిటీ బాధ్యులకు, విద్యార్థులకు డైరెక్టర్ సూచించారు. ఆందోళన సమాచారం అందుకున్న కేయూ పోలీస్‌స్టేషన్ సీఐ రవికుమార్, ఎస్‌ఐ రవీందర్ ఇతర పోలీస్ సిబ్బందితో అక్కడి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. పోలీసుల సమక్షంలోనూ డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీస్ అధికారులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీ అధికారులతో మాట్లాడాలని సూచించగా వీసీని కలిసేందుకు వెళ్లారు.
వీసీతో సమావేశం..
మెస్ కమిటీ బాధ్యులు, కొందరు విద్యార్థులు కేయూలోని పరిపాలనా భవనం వద్దకు వచ్చారు. కేయూ వీసీ ఆచార్య కే ప్రతాప్‌రెడ్డి మెస్ కమిటీ బాధ్యులతో అకాడమిక్ కమిటీహాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మెస్ కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.. మెస్‌లో అవకతవకలకు పాల్పడుతుండడంతో భోజనం నాణ్యతగా ఉండటం లేదని ఆరోపించారు. సూపర్‌వైజర్ నిరంజన్‌రెడ్డి, కేర్‌టేకర్ రాజు, హాస్టళ్ల డైరెక్టర్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. దీనికి వీసీ స్పందిస్తూ.. కేర్‌టేకర్ రాజును, సూపర్‌వైజర్ నిరంజన్‌రెడ్డిని కామన్‌మెస్ విధుల నుంచి తొలగిస్తున్నట్లు విద్యార్థులకు తెలిపారు. హాస్టళ్ల డైరెక్టర్‌ను కూడా మార్చాలని విద్యార్థులు డిమాండ్ చేయగా..ప్రస్తుతం హాస్టళ్ల డైరెక్టర్‌గా బాధ్యతలను నిర్వర్తించేందుకు ఎవరూ ముందుకు రావటం లేదని, త్వరలోనే కామన్‌మెస్ వ్యవహారంపై అవసరమైతే ఓ కమిటీ నియమిస్తామని, హాస్టళ్ల డైరెక్టర్‌గా రాజ్‌కుమార్ కొనసాగుతారని తెలిపారు. ఏమైనా సమస్యలు తలెత్తితే రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
కట్టెల సరఫరా కాంట్రాక్టు రద్దు..
కాకతీయ యూనివర్సిటీ కామన్‌మెస్‌కు కట్టెలను సరఫరా చేసే కాంట్రాక్టర్ కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఆచార్య ఎల్‌పీ రాజ్‌కుమార్ తెలిపారు. సంబంధిత కాంట్రాక్టర్‌కు సమాచారం ఇచ్చామన్నారు.
13 టన్నులు రావాల్సిన కట్టెలను తక్కువగా తీసుకొచ్చారని ఆరోపణ
కూరగాయల సరఫరాలో కూడా అవకతవకలు..
భోజనం నాణ్యతగా ఉండటం లేదని కేర్‌టేకర్, డైరెక్టర్‌తో వాగ్వాదం
పోలీసులు నచ్చజెప్పినా వినని విద్యార్థులు
మెస్ కమిటీ బాధ్యులు, విద్యార్థులతో వీసీ సమావేశం
కేర్‌టేకర్, సూపర్‌వైజర్లను తొలగిస్తున్నట్టు ప్రకటన

కేయూలో ఉద్రిక్తత