
ముంపు సమస్యను ఎదుర్కోవాలి
ఏటూరునాగారం/కన్నాయిగూడెం: వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా సమాయత్తం కావాలని, గతంలో వరద ముంపుతో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కావొద్దని రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ములుగు కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాధ్యాయతో కలిసి జిల్లాలోని కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజీ నీటినిల్వలు, గేట్ల వివరాలను పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఎంతవరకు వస్తుందని, ఏ మేరకు నీటిని విడుదల చేస్తారని ఆరా తీశారు. సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎగువన ఉన్న లక్ష్మీ, సరస్వతీ, ఎస్సారెస్పీతోపాటు ఎగువన ఉన్న నదులు, ఉపనదుల నుంచి బ్యారేజీలోకి చేరుతుందని దివాకర తెలిపారు. బ్యారేజీ వద్ద ఉన్న 59 గేట్లను ఎత్తి దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. బ్యారేజీ ఎగువన దేవాదుల ఎత్తిపోతల వద్ద 10 మోటార్లు మూడు ఫేజ్‌లలో ఉన్నాయని, దిగువన ఉన్న రిజర్వాయర్‌ల నీటి వినియోగాన్ని బట్టి పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ..వరదల ముంపు నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు ప్రణాళికల్లో భాగంగా ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండడంతో తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
అప్రమత్తంగా ఉన్నాం..
ఈసందర్భంగా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ..వర్షాకాలంలో తక్షణ చర్యలకు అవసరమైన సిబ్బందిని, వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్, టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో 80 పునరావాస కేంద్రాలను ముందస్తుగా గుర్తించామన్నారు. బెడ్ షీట్లు, ఆహారం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7గా పనిచేసేలా చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేశ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్‌సింగ్, ఏపీఓ వసంతరావు, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ముందస్తు ప్రణాళికలతో అధికారులు సిద్ధంగా ఉండాలి
రాష్ట్ర రెవెన్యూ (విపత్తు నిర్వహణ)ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్
కన్నాయిగూడెంలో సమ్మక్క బ్యారేజీ పరిశీలన
ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయంలో వరద ముంపుపై సమీక్ష

ముంపు సమస్యను ఎదుర్కోవాలి