
ట్రాలీఆటో ఢీకొని చిన్నారి మృతి
కమలాపూర్: ట్రాలీఆటో ఢీకొని 15 నెలల చిన్నారి మృతిచెందింది. ఈఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గుండేడులో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గుండేడుకు చెందిన కాలేశ శ్రీకాంత్, తిరుమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు రిషిక ఇంటిముందు ఆడుకుంటుండగా హసన్‌పర్తికి చెందిన గుండమీది శ్రీనివాస్ అనే వ్యక్తి ట్రాలీఆటోకు మైక్ పెట్టుకుని పెద్ద శబ్దంతో అల్లం, వెల్లుల్లి అమ్ముకుంటూ.. అతివేగంగా ఆటో నడుపుకుంటూ వచ్చి రిషికను ఢీకొట్టాడు. ఈప్రమాదంలో రిషిక అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్ పారిపోయాడు. అప్పటివరకు తమతో ఆడుకున్న రిషిక రోడ్డు ప్రమాదంలో విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రిషిక తండ్రి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు గుండమీది శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు.
జ్వరంతో యువతి..
వాజేడు: ఏజెన్సీలో జ్వరంతో బాధపడుతున్న ఓ యువతి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరాపురం గ్రామానికి చెందిన ఉయిక దీపిక(22) కొన్ని రోజులుగా జ్వరంతో బాధ పడుతోంది. గత నెల 29న వాజేడు వైద్యశాలలో చేరగా పరీక్షలు చేసి రెండు రోజులు వైద్యం అందించారు. ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నట్లు తెలపడంతో వెంటనే ఏటూరునాగారంలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేరగా నాలుగు రోజులు వైద్యం చేశారు. కుడివైపున నొప్పి వస్తుందని దీపిక తెలపడంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వరంగల్ వెళ్లాలని సూచించారు. వరంగల్‌కు తరలించి వైద్యం అందిస్తుండగానే దీపిక సోమవారం రాత్రి మృతి చెందింది. దీపిక బీఈడీకి ప్రిపేర్ అవుతుంది. మృతురాలి తండ్రి రామారావు నాలుగు సంవత్సరాల క్రితం చనిపోగా, తల్లి దేవమ్మ, అన్న కలిసి దీపికను చదివిస్తున్నారు.
ప్రమాదవశాత్తు వాగులో పడి వృద్ధుడు..
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం బూజునూర్‌పల్లికి చెందిన మామిడాల ఇంద్రారెడ్డి (60) అనే వృద్ధుడు సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందినట్లు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..ఇంద్రారెడ్డి సోమవారం గొర్రుకొట్టడానికి వెళ్లి సాయంత్రం గొర్రును, ఎద్దులను కడగటానికి దగ్గరలో ఉన్న వాగు వద్దకు వెళ్లాడు. ఎద్దులను కడిగిన అనంతరం గొర్రు కడుగుతుండగా ప్రమాదవశాత్తు వాగులో పడిపోయాడు. రాత్రయినా ఇంద్రారెడ్డి ఇంటికి రాకపోవడంతో స్థానికులతో కలిసి కుటుంబసభ్యులు ఇంద్రారెడ్డి కోసం వెతికారు. వాగు వద్ద ఎద్దులు, గొర్రు, వాగులో ఇంద్రారెడ్డి మృతదేహం కనిపించింది. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ హరికృష్ణ పేర్కొన్నారు.

ట్రాలీఆటో ఢీకొని చిన్నారి మృతి