
ఇద్దరు విద్యుత్ ఉద్యోగుల సస్పెన్షన్
హన్మకొండ: అవినీతి ఉద్యోగులపై టీజీఎన్పీడీసీఎల్ యాజమాన్యం వేటువేసింది. ఖమ్మం సర్కిల్‌లోని తిరుమలయపాలెంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్.భాస్కరరావు, ఏఎల్‌ఎం యు.జగత్ జీవన్ అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో వెల్లడి కావడంతో సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని యాజమాన్యం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. సర్కిల్ పరిధిలోని చింతల్‌తండా రైతులు కొత్త వ్యవసాయ సర్వీసుకు దరఖాస్తు చేసుకోగా, మంజూరు చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేశారు. తాము అంత మొత్తం చెల్లించుకోమని చెప్పి చివరకు రూ.90 వేలు అందించారు. ఈవిషయం యాజమాన్యం దృష్టికి రావడంతో విజిలెన్స్ విచారణ చేపట్టగా..రైతుల నుంచి రూ.90 వేలు తీసుకున్నట్లు వెల్లడైంది. దీంతో వారిని సస్పెండ్ చేసింది. ఎవరైనా అవినీతికి పాల్పడితే 92810 33233 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని యాజమాన్యం కోరింది.
ఎస్జీటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్
విద్యారణ్యపురి: స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల ప్రక్రియలో భాగంగా మంగళవారం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఎస్జీటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. హనుమకొండ జిల్లాకు సంబంధించి సీనియారిటీ తాత్కాలిక జాబితాను వెల్లడించడంతో 460మందిని సర్వీస్‌బుక్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిలిచారు. మొత్తం 8 కౌంటర్లను ఏర్పాటుచేసి పరిశీలన జరిపారు. 360మంది వరకు వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందరి వెరిఫికేషన్ పూర్తయ్యాక మరోసారి సీనియారిటీ జాబితా వెల్లడిస్తారు.
చేయూత పెన్షన్ సకాలంలో అందించాలి
హన్మకొండ: చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు పద్ధతి ద్వారా సకాలంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందజేయాలని, ఈ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చేయూత పెన్షన్ రాష్ట్ర డైరెక్టర్ గోపాల్ రావు సూచించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయ ఆడిటోరియంలో వరంగల్ జిల్లా ఎంపీడీఓలు, సెక్షన్ క్లర్కులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ కమిషనర్లు, బిల్ కలెక్టర్లకు చేయూత పెన్షన్‌లపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో గోపాల్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రతీ గ్రామపంచాయతీలోని రిజిస్టర్‌లో పెన్షన్ పంపిణీ వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు. మరణించిన పెన్షన్‌దారులను వెంటనే ఆన్‌లైన్‌నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. సదస్సులో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌డీఓ కౌసల్యదేవి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.