
చి‘వరి’కి నీరందేనా?
డోర్నకల్: నిండుగా మున్నేరు వాగు.. దానికి అనుసంధానంగా సుమారు 12కిలోమీటర్ల పొడవుతో కట్టుకాల్వ నిర్మాణం.. సుమారు 2,000 ఎకరాల ఆయకట్టు పారుతోంది. డోర్నకల్, అమ్మపాలెం తహసీల్దార్ బంజర, పాపటపల్లి తదితర గ్రామాలకు చెందిన రైతులు వందల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అయితే పిచ్చి మొక్కలు, చెట్లు మొలిచి కట్టుకాల్వ చివరి ఆయకట్టుకు సాగు నీరందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆరు కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు..
కట్టుకాల్వలో కొంతకాలం క్రితం సుమారు 6 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టారు. మున్నేరువాగుకు డోర్నకల్ వైపు కట్టుకాల్వకు నీటిని విడుదల చేసేందుకు రెండు షట్టర్లు ఏర్పాటు చేసి వాగు నిండుగా ఉన్న సమయంలో షట్టర్లు తెరిచి కాల్వకు నీటిని విడుదల చేస్తున్నారు. వానాకాలంలో సుమా రు రెండు వేల ఎకరాల్లో రైతులు ప్రధాన పంటగా వరితో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు.
చివరి ఆయకట్టుకు చేరని నీరు..
పలు కారణాల వల్ల కట్టుకాల్వ చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండి రైతులు నష్టపోతున్నారు. మున్నేరువాగు వద్ద రెండు షట్టర్లు ఉండగా ఒక షట్టర్ డోర్‌తో పాటు పైభాగంలో డోర్ తెరిచే పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ప్రస్తుతం ఒకే షట్టర్‌ను తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. కాల్వలో చెట్లు, పిచ్చి మొక్కలు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డుగా మారాయి. కిలోమీటర్ల మేర చెట్లు, గడ్డి, పిచ్చి మొక్కలు పెరగడంతో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. మున్నేరువాగు నుంచి సుమారు కిలోమీటరు దూరంలో కాల్వ నీటి ప్రవాహం కోసం చిన్నపాటి టన్నెల్ నిర్మాణం చేశారు. సక్రమంగా నిర్మాణం చేపట్టకపోవడం, నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో కాల్వ నిండి నీరు రోడ్డు మీదుగా తిరిగి మున్నేరువాగులోకి ప్రవహిస్తోంది. అలాగే కాల్వకు అక్కడక్కడా గండ్లు పడడంతో నీరు వృథాగా పోతోంది.
ఆ గ్రామాలకు అందని నీరు..
చివరి ఆయకట్టు గ్రామాలైన తమసీల్దారు బంజర, సీతారాంపురం తదితర గ్రామాల రైతుల భూములకు నీరందడం లేదు. ప్రస్తుతం కట్టుకాల్వ ప్రారంభంలో నిండుగా ప్రవహిస్తుండగా తహసీల్దారు బంజర సమీపంలో కాల్వలో చుక్క నీరు కనిపించదు. కట్టుకాల్వ నీటిని నమ్ముకుని పంటలు సాగు చేస్తున్న ఆయకట్టు చివరి రైతుల పంటలు చేతికందే దశలో ఎండిపోతున్నాయి. ఏటా వానాకాలం ముందు కట్టుకాల్వలో చెట్లు తొలగించి శుభ్రం చేయాలని, పూర్తిస్థాయి కాల్వకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టాలని అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదంటూ రైతులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కాల్వ పూర్తిస్థాయి మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.
మరమ్మతులు చేపట్టాలి
మున్నేరువాగు నుంచి 12 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కట్టుకాల్వకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. చాలా చోట్ల చెట్లు, పిచ్చి మొక్కలు పెరగడంతో కాల్వకు గండ్లు పడి చివరి ఆయకట్టుకు సాగు నీరందడం లేదు.
–వేల్పుల వెంకన్న, రైతు, తహసీల్దారు బంజర
చెట్లు, పిచ్చిమొక్కలతో
పూడుకుపోయిన కట్టుకాల్వ
మున్నేరువాగు వద్ద
తెరుచుకున్న ఒకే షట్టర్
చివరి ఆయకట్టు రైతుల ఆందోళన

చి‘వరి’కి నీరందేనా?

చి‘వరి’కి నీరందేనా?

చి‘వరి’కి నీరందేనా?