
హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి
కొత్తగూడ: హక్కుల సాధనకు ఆదివాసీలంతా ఐక్యంగా ఉద్యమించాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగబోయిన రవి సూచించారు. మండల కేంద్రంలో జరిగిన ఆదివాసీ సంఘాల సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓవైపు అక్రమ వలసలు, మరో వైపు ప్రభుత్వాల అలసత్వంతో ఆదివాసీలు తమ అస్తిత్వం కోల్పోయే ప్రమాదం ఉందని, అన్ని సంఘాలు సంఘటితం కావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. మన ఐక్యతకు ఈనెల 9న జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సం వేదిక కావాలని అన్నారు. అందుకు అందరూ కలిసి వచ్చి భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలన్నారు. పలు ఆదివాసీ సంఘాల నాయకులు సందీప్‌దొర, సతీష్, వెంకన్న, నాగేశ్వర్‌రావు, లక్ష్మీనారానయణ, ప్రశాంత్, ఉద్యోగ సంఘాల నాయకులు సిద్దబోయిన బిక్షం, సుంచ సారయ్య, కల్తి ఎల్లయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
విద్యలో అంతరాలు
తొలగించాలి
కేయూ క్యాంపస్: విద్యలో అంతరాలు తొలగించాలని ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ పౌరస్పందన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ‘విద్యలో అంతరాలు–అసమానతలు తొలిగిపోయేది ఎలా’ అంశంపై హనుమకొండలోని యూనివర్సిటీ న్యాయ కళాశాలలో ఆదివారం నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో ప్రైవేటీకరణతోనే అంతరాలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రాఽథమిక, మాధ్యమిక విద్యాసంస్థలు దిక్కులేనివిగా తయారయ్యాయని తెలిపారు. ఇంజనీరింగ్‌లో రూ.45 వేల నుంచి రూ.1,51,600 వరకు ఫీజులు ఉన్నాయని వివరించారు. ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్, తెలంగాణ ఉద్యమకారుల వేదిక చైర్మన్ కె. వెంకటనారాయణ మాట్లాడుతూ ప్రపంచీకరణతో విద్యారంగంలో అంతరాలు బాగా పెరిగిపోయయన్నారు. ఈ అంతరాలు పోవాలంటే ప్రగతిశీల భావాలున్న ప్రజాశ్రేణులను ఐక్యం చేసి పాలకవర్గాలపై పోరాటం చేయడమే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యాం మాట్లాడుతూ 1980 నుంచే విద్య వ్యాపార సరుకుగా మారిందన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ విద్యలో అంతరాలు పోవాలంటే ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ సంఘాలు బాధ్యుల లక్ష్మారెడ్డి, రామమూర్తి, శ్రీధర్‌గౌడ్, విజయకుమార్, వీరస్వామి, రాజిరెడ్డి, పెండెం రాజు, రవీందర్‌రాజు, శ్రీధర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి : సీపీ సన్‌ప్రీత్‌సింగ్
వరంగల్ క్రైం: రిటైర్డ్ పోలీసులు, ఉద్యోగులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ సూచించారు. పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ కాలం విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఏఎస్సై వీవీఎల్‌ఎన్ మూర్తి, హెడ్‌కానిస్టేబుల్ జె.కేశవ్, కానిస్టేబుల్ ఎం.ఎల్లయ్య, నాలుగో తరగతి ఉద్యోగి కె.యాదయ్యను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రిటైర్డ్ అధికారుల సేవలు నేటితరం పోలీసులకు అదర్శమని, ప్రశాంత వాతావరణానికి మీ సేవలే కారణమని పేర్కొన్నారు. అదనపు డీసీపీ, శ్రీనివాస్, ఆర్‌ఐలు నాగయ్య, సతీశ్, ఆర్‌ఎస్సై శ్రవణ్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నేడు కన్నెపల్లి పంపు హౌస్ సందర్శన
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంపు హౌస్‌ను నేడు (సోమవారం) బీఆర్‌ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సందర్శించనున్నారు. మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆధ్వర్యంలో మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, రసమయి బాలకిషన్, వోడితల సతీష్‌బాబు, సుంకే రవిశంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి రానున్నారు.

హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలి