
ఉత్తమ బోధన.. మెరుగైన సౌకర్యాలు
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో దోస్త్ ద్వారా అడ్మిషన్లకు అవకాశం కల్పించారు. కాగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా ఇంగ్లిష్ మీడియంలో బోధన చేపడుతున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో జిల్లా కేంద్రంలో డిగ్రీ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంతో ఏటా అడ్మిషన్ల సంఖ్య పెరుగుతోంది.
కళాశాల అభివృద్ధి..
జిల్లాలోని తొర్రూరు, కేసముద్రం, మరిపెడ, గార్ల, మానుకోటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో 1983లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ గ్రూపులతో ప్రారంభమైంది. ప్రస్తుతం కళాశాలలో 575 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కళాశాల అభివృద్ధిపై అధ్యాపకులు ప్రత్యేక దృష్టి పెట్టారు. అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్ ల్యాబ్, ఇంగ్లిష్ లెర్నింగ్ ల్యాబ్, సైన్స్, బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తరగతి గదుల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ తరగతులు, స్మార్ట్ బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే కళాశాలలో మంచి వాతావరణం, ఆహ్లాదాన్ని అందించేందుకు మొక్కలు నాటిసంరక్షించే బాధ్యతలు చేపడుతున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రత్యేక చొరవతో ఇంగ్లిష్‌లో బోధన జరుగుతోంది. దీంతో గత సంవత్సరం నుంచి విద్యార్థుల అడ్మిషన్లు భారీగా పెరిగాయి. అంతేకాకుండా క్రీడలు, పీజీ సెట్ ర్యాంకుల్లో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరస్తున్నారు.
కళాశాలలోని కోర్సులు..
బీఏ (హెచ్‌ఈపీ), బీకాం కంప్యూటర్స్, జనరల్, బీఎస్సీ (ఎంపీసీ), బీఎస్సీ (ఎంపీసీఎస్), బీఏ (హెచ్‌పీసీఏ), బీఎస్సీ (బైపీసీ), బీఎస్సీ (బీజెడ్‌సీ) కోర్సులు ఉన్నాయి. తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగుతోంది. కాగా, న్యాక్‌లో 2.98 పాయింట్లతో జాతీయ స్థాయిలో మానుకోట డిగ్రీ కళాశాల బి–ప్లస్‌ప్లస్ గ్రేడ్ గుర్తింపు పొందింది. కళాశాల నుంచి చాలా మంది విద్యార్థులు పలు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలతో విద్య
మానుకోట డిగ్రీ కళాశాలలో అన్ని కోర్సులను తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నాం. ఇక్కడ చదివిన విద్యార్థులు దేశంలోని పలు యూనివర్సిటీల్లో పీజీ కోర్సుల్లో సీట్లు సాధించారు. పేద విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఒక వరంలాంటిది. బాలికలకు ప్రత్యేకంగా బీసీ బాలికల హాస్టల్ డిగ్రీ కళాశాల ఆవరణలోనే కలెక్టర్ చొరవతో ఏర్పాటు చేశాం. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలోనే చేర్పించాలి.
– లక్ష్మణ్‌నాయక్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్
అధ్యాపకుల ప్రోత్సాహంతోనే
ర్యాంకు సాధించా..
ప్రతీ సబ్జెక్టులో సందేహాలు ఉంటే వెంటనే అధ్యాపకులు నివృత్తి చేసేవారు. ఎప్పటి సిలబస్ అప్పుడే పూర్తి చేసేది. కళాశాల అధ్యాపకుల ప్రోత్సాహంతో నేను బ్యాచ్‌లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ)లో 28వ ర్యాంకు సాధించాను.
–యాప శిరీష, కళాశాల విద్యార్థిని
డిగ్రీ కళాశాలల్లో
దోస్త్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ
జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో
ఇంగ్లిష్ మీడియంలో బోధన
అత్యాధునిక టెక్నాలజీతో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటు

ఉత్తమ బోధన.. మెరుగైన సౌకర్యాలు

ఉత్తమ బోధన.. మెరుగైన సౌకర్యాలు