
నేడు గురుపౌర్ణమి
● సాయిబాబా ఆలయాల్లో
ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: ఆషాఢ శుద్ధ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అంటారు. వేద సంహితలను రాసిన వ్యాసభగవానుడిని పూజిస్తారు. వ్యాసభగవానుడు వ్యక్తికాదని గురువే అని భావించేవారు గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. భక్తులు సాయిమందిరాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో గురువారం హనుమకొండ బస్టాండ్ సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరం, యాదవనగర్‌లోని సాయిబాబా ఆలయం, పద్మాక్ష్మీనగర్‌లోని సాయిబాబా ఆలయం, భద్రకాళి దేవాలయం దగ్గర ఉన్న సాయిబాబా మందిరంలో గురుపౌర్ణమి సందర్భంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కాగా, హనుమకొండ బస్టాండ్ సమీపంలోని షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం ఉదయం 5 గంటల నుంచి ప్రభాతసేవ, 6 గంటలకు మంగళస్నానం, ఉదయం 8 నుంచి 11గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 5గంటలకు పూజలు ఉంటాయని చైర్మన్ మతుకుమల్లి హరగోపాల్ తెలిపారు.
పత్తి పంటలో యాజమాన్య పద్ధతులు..
● రైతులు అవగాహన పెంచుకోవాలి
● కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న
మామునూరు: పత్తి పంటలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులపై రైతులు అవగాహన పెంచుకోవాలని కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ రాజన్న సూచించారు. ఈ మేరకు బుధవారం మామునూరు, సింగారం, ఒంటి మామిడిపల్లి గ్రామాల్లో కృషి విజ్ఞాన కేంద్రం, మామునూరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పత్తి పంటలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు. మే చివరి వారం, జూన్ మొదటి వారంలో విత్తుకున్న పత్తి పంటలు, ప్రస్తుతం 30 నుంచి 45 రోజుల వయసులో ఉన్న పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంటలో తామర పురుగులు, పచ్చ దోమ, పేనుబంక, గోధుమ రంగు ముక్కు పురుగు ఉధృతి గమనించారు. వీటి నివారణకు రైతులు పంట తొలి దశ నుంచే సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలన్నారు. తామర పురుగుల నియంత్రణకు ఎకరాకు 10 చొప్పున నీలి రంగు జిగురు అత్తలు అమర్చుకోవాలన్నారు.

నేడు గురుపౌర్ణమి