క్షణికావేశం.. తీరనిశోకం
బయ్యారం: నిత్యం మద్యం తాగొద్దని భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మండలంలోని ఉప్పలపాడులో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ బాలు(61) నిత్యం మద్యం తాగుతుండడంతో భార్య అమ్మి మందలించింది. దీంతో బాలు గత నెల 24వ తేదీన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబసభ్యులు మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు నరేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
గేదె అమ్మిన డబ్బుల విషయంలో
గొడవ పడి రైతు..
సంగెం: గేదె అమ్మిన డబ్బుల విషయంలో గొడవ పడి మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సంగెం మండలం బీకోజీనాయక్ తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకుచెందిన మూడు ఈరు(49), పద్మ దంపతులకు ఒక కుమారుడు వెంకటేశ్, ఒక కూతురు ఉన్నారు. ఈరు గేదెను అమ్మి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా తనవద్దే ఉంచుకున్నాడు. ఇంటి ఎదుట సంపు నిర్మించడానికి డబ్బులు ఇవ్వమని కుమారుడు వెంకటేశ్ అడిగాడు. తన వద్ద డబ్బులు లేవని ఈరు సోమవారం ఉదయం గొడవ పడి వ్యవసాయ బావి వద్ద పని ఉందని వెళ్లాడు. సాయంత్రం భూమి పక్కనగల రైతు లక్ష్మణ్ ఫోన్ చేసి ఈరు బావి వద్ద పడి ఉన్నాడని తెలపడంతో వెళ్లి చూడగా నోటి నుంచి నురగలు వస్తున్నాయి. 108లో ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు.
ప్రేమ విషయంలో
బెస్తగూడెంలో యువకుడు..
వెంకటాపురం(కె): మండలంలోని బెస్తగూడెం గ్రామంలో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగ విజయ్(22) ఎలక్ట్రిషన్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విజయ్ కొంత కాలంగా యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఏమైందో తెలియదు కాని యువతి విషయంలో మనస్తాపం చెందుతూ జీవితంపై విరక్తి చెంది సోమవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొప్పుల తిరుపతి రావు తెలిపారు.
క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆ కుటుంబాలకు తీరని శోకం మిగిల్చాయి. నిత్యం మద్యం తాగొద్దని అన్నందుకు ఒకరు, గేదె విక్రయించగా వచ్చిన డబ్బులు ఇవ్వాలని కుటుంబీకులు కోరగా అందుకు ససేమిరా అని వారితో గొడవ పడి మరొకరు, ప్రేమ విషయంలో ఓ యువకుడు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా కారణం ఏదైనా కానీ ఆలోచించకుండా కఠిన నిర్ణయాలు తీసుకుని తనువులు చాలించారు. దీంతో ఆయా కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.
క్షణికావేశం.. తీరనిశోకం


