సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
కాళేశ్వరం : జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతీనది పుష్కరాలు నేడు ప్రారంభ కానున్నాయి. గురువారం నుంచి 26వ తేదీ వరకు 12 రోజుల పాటు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం రాత్రి 10.35 గంటలకు బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. కాగా, రాత్రి సమయం సందర్భంగా (నేడు) గురువారం ఉదయం 5.44 గంటలకు వేదపండితులు ముహూర్తం ఖరారు చేశారు. నదికి విశేష పూజాకార్యక్రమాలతో వేదపండితులు పుష్కరుడిని ఆహ్వానిస్తారు. ఈ పూజలో మెదక్ రంగంపేటకు చెందిన పీఠాధిపతి మాధవానందాసరస్వతి పాల్గొననున్నారు. పీఠాధిపతితో మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ వెంకట్‌రావు, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరే, దేవస్థానం అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొననున్నారు. పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తజనం తరలిరానుందని అధికారులు అంచనా. 12 రోజుల పాటు కాళేశ్వరంలో పుష్కర శోభ నెలకొననుంది. ఉత్తరాఖండ్‌లోని మానస నది, ఆలహాబాద్‌లోని గంగా, యమున, అంతర్వాహిణి సరస్వతి, తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత, అంతర్వాహిణి సరస్వతి నదులకు పుష్కరాలు జరుగుతాయి.
ఏర్పాట్లు ఇలా..
సరస్వతీనది పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్లు మంజూరు చేసింది. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ ప్రత్యేక దృష్టితో పనులు ముమ్మరం చేశారు. అంతర్గత సీసీ రోడ్లు, ప్రసాదశాల కౌంటర్లు, పుష్కరఘాట్ విస్తరణ, రెండు ఘాట్‌ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, శాశ్వత మరుగుదొడ్లు, కల్యాణ కట్ట, మెయిన్ ఘాట్ నుంచి సరస్వతీఘాట్‌కు గ్రావెల్‌రోడ్డు, గోదావరిలో మట్టిరోడ్డు, వీఐపీ ఘాట్ నుంచి పలుగుల రోడ్డు మట్టిరోడ్డు, చలువ పందిళ్లు, సరస్వతీమాత విగ్రహం, హారతి స్టేజీపై ఏడు గద్దెలు, జ్ఞానదీపం, తాత్కాలికంగా డెకరేషన్స్, టెంట్‌సిటీ, డార్మెటరీ హౌస్‌లు, ఎగ్జిబిషన్ స్టాళ్లు, జల్లు స్నానాలు, దుస్తులు మార్చుకునే గదులు ఏర్పాటు చేశారు. మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు. కాళేశ్వరం కొత్త బస్టాండ్, వాసవీ సత్రం, అంతర్రాష్ట్ర వంతెన సమీపం, హరితహోటల్ సమీపం, వీఐపీఘాట్, ఇబ్బలబోరు వద్ద పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. పీఠాధిపతుల విడిది కోసం త్రివేణి గెస్ట్‌హౌస్‌లో సాలహారంతో ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు కాశీ పండితులతో హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రతీ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
సరస్వతీమాత విగ్రహం వెనుక ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమ
నేటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహణ
నేటి ఉదయం 5.44 గంటలకు
ముహూర్తం ఖరారు
ప్రారంభ పూజలో పాల్గొనున్న పీఠాధిపతి మాధవానందాసరస్వతి,
మంత్రి శ్రీధర్‌బాబు
పుష్కర స్నానాలకు సరస్వతీఘాట్,
మెయిన్ ఘాట్
టెంట్‌సిటీ, హారతి స్టేజ్ ఏర్పాటు
లక్షలాదిగా తరలిరానున్న భక్తజనం
నేడు కాళేశ్వరానికి సీఎం రాక
సాక్షి ప్రతినిధి వరంగల్/కాళేశ్వరం: కాళేశ్వరానికి రాష్ట్రముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి దంపతులు గురువారం రానున్నారు. ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి సాయంత్రం 4గంటలకు బయలుదేరుతారు. 5గంటలకు కాళేశ్వరం చేరుకొని వీఐపీ ఘాటులోని టెంట్ సిటికి వప్తారు. 5.25గంటలకు సరస్వతిమాత విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 6గంటలకు సరస్వతినదిలో సీఎం దంపతులు సంకల్ప పుష్కరస్నానం చేస్తారు. 6.05గంటలకు శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు. 6.30గంటలకు అర్చకులతో ఆశీర్వచనం చేస్తారు. 6.40గంటల నుంచి రాత్రి 7గంటల వరకు సరస్వతి నవ రత్నమాల హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 8 గంటల తరువాత రోడ్డు మార్గం గుండా భూపాలపల్లికి చేరుకుంటారని సీఎం కార్యాలయంనుంచి షెడ్యూల్ ఖరారు చేశారు.
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..
సరస్వతీనది పుష్కరాలకు వేళాయె..


