మహబూబాబాద్ రూరల్: మూడు రోజుల బంద్ అనంతరం సోమవారం నుంచి కొనుగోళ్లు జరగనుండగా.. మానుకోట వ్యవసాయ మార్కెట్ మిర్చి బస్తాలతో ఆదివారం కళకళలాడుతూ కనిపించింది. రైతులు తెల్లవారుజామున 3గంటల నుంచే మార్కెట్‌కు వాహనాల్లో మిర్చి బస్తాలను తీసుకురావడం మొదలుపెట్టారు. రైతులు తాము తీసుకువచ్చిన మిర్చి బస్తాలను మార్కెట్ ఆవరణలోని ఎనిమిది షెడ్లలో దిగుమతి చేసుకున్నారు. అయితే షెడ్లలో స్థలం సరిపోకపోవడంతో ఆరుబయట సీసీపై కూడా మిర్చి బస్తాలను దించారు. భారీగా మిర్చి రావడంతో మార్కెట్ సిబ్బంది టోకెన్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
టోకెన్లకు డబ్బులు ఇవ్వొద్దు..
వ్యవసాయ మార్కెట్ యార్డులో టోకెన్లు ఇచ్చే సమయంలో రైతులు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దని ఏఎంసీ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, సెక్రటరీ షంషీర్ తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ ప్రధాన ద్వారం వద్ద, మార్కెట్ యార్డు ఆవరణలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మార్కెట్ యార్డులో దానధర్మాల పేరిట ఎవరికీ గింజలు ఇవ్వకూడదని రైతులకు సూచించారు.