వనభోజనం.. పుణ్యఫలం | - | Sakshi
Sakshi News home page

వనభోజనం.. పుణ్యఫలం

Nov 5 2024 1:11 AM | Updated on Nov 5 2024 1:11 AM

వనభోజ

వనభోజనం.. పుణ్యఫలం

కాజీపేట : కార్తీక మాసం.. శివ, కేశవులు ఇద్దరిని పూజించే పవిత్ర మాసం. ఈ మాసంలో పూజలకు ఎంత ప్రాధాన్యం ఉందో వనభోజనాలకు అంతే ప్రాధాన్యం ఉంటుంది. ఈ కాలంలో దేవతలు వనాల్లో విహరిస్తూ చెట్లపై కొలువుదీరుతారని హిందువుల నమ్మకం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శ్రీమహవిష్ణువుగా భావిస్తారు. ఈ చెట్టు కింద భోజనం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. అనాదిగా కొనసాగుతున్న సంప్రదాయం ఇది. ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరి చెట్టు కింద సామూహిక వనభోజనాలు చేస్తే పుణ్య ఫలం దక్కుతుందని పురాణేతిహాసాలు పేర్కొటున్నాయి. మహర్షులు కూడా దీనిని ఆచరించినట్లు చెబుతారు. నేడు అంతటి విశిష్టత లేకపోయినా సంప్రదాయం ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. అడవులు అంతరించి పోతున్న ఈ రోజుల్లో ఉసిరి చెట్టుకు కొరత ఉండడంతో ఏదో ఒక చెట్టు కింద సంప్రదాయాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమైఖ్యతకు చిహ్నంగా చెప్పుకునే వనభోజనాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఉసిరి చెట్టే కాదు..అన్నీ వేదికలే

కార్తీక మాసంలో ఒక్కరోజైనా ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే దేవుడి అనుగ్రహం లభిస్తుందని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. అంత మాత్రన ఉసిరి చెట్టు లేకపోతే ఫలితం ఉండనవసరం లేదని వారు పేర్కొంటున్నారు. ఎవరి అభీష్టం మేరకు వారు తమకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకుని వనభోజనా లు పూర్తి చేయొచ్చంటున్నారు. కొందరు ఉద్యానవనాల్లో పిక్నిక్‌లకు ప్రాధాన్యం ఇస్తారు. మరి కొందరు నదులు, సముద్ర తీరాల్లో జరుపుకుంటారు. తోటలు అందుబాటులో ఉన్న ప్రాంతాల వారు ఆయా ప్రదేశాల్లో పిక్నిక్‌లు జరుపుకుంటారు.

కుల సంఘాల జోరు..

సామూహిక వనభోజనాల్లో కుల సంఘాల జోరు కొనసాగుతోంది. కులాల వారీగా విడిపోయి వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా వనభోజనాలు ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగుతున్నాయి.

ముందస్తు ప్రణాళిక అవసరం..

వనభోజనాల్లో రోజంతా ఆనందోత్సాహాలతో గడిపి మధురానుభూతిని సొంతం చేసుకోవాలంటే ముందస్తు ప్రణాళిక తప్పనిసరి. ఎంతమంది వెళ్తున్నారో పక్కాగా నిర్ణయించుకుని అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోవాలి. ఉదయం వేగంగా వెళ్తే ఎక్కువ సేపు గడిపామనే ఆనందం కలుగుతుంది. నీడనిచ్చే ప్రాంతాలను ఎంపిక చేసుకోవాలి.

ఆధ్యాత్మిక చింతనతో..

వనభోజనాలు ఆధ్యాత్మిక చింతనతోపాటు హైందవ ధర్మాన్ని చాటి చెబుతాయి. వనసమారాధన వల్ల ఆయుర్వేదంలో వృక్ష జాతికున్న విశిష్టత అందరికీ తెలుస్తుంది. ఆహారాన్ని మహావిష్ణువుకు ప్రీతి అయిన ఉసిరి చెట్టు కింద తింటే ప్రతిఫలం ఉంటుంది. ఈ కారణంతోనే సామూహిక వనభోజనాలు చేసే వారు ఇప్పటికీ ఉన్నారు. ప్రధానంగా దైవభక్తి, గ్రామీణ నేపథ్యం ఉన్న వారు ఇలాంటి సంప్రదాయాలను పాటిస్తున్నారు.

పెళ్లి చూపుల వేదికగా..

వనభోజనాలు పెళ్లి చూపులకు వేదికలుగా మారిపోయాయి. తమ పిల్లలకు మంచి సంబంధాలు వెతకాలంటే వనభోజనాలకు హాజరై ఇరు కుటుంబాల వారు మాట, మంచి పంచుకుంటున్నారు. ప్రధానంగా పెళ్లి సంబంధాలు చూసే కుటుంబాలు తప్పకుండా వనభోజనాలకు హాజరవుతున్నారు. ఆయా కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడం, ఒకరినొక్క రు చూసుకోవడం వనభోజనాల్లోనే జరిగిపోతున్నా యి. నచ్చితే ఆ తర్వాత కొనసాగింపు ఉంటుంది.

పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి..

పిల్లలతో వనభోజనాలకు వెళ్తే అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వారికి ఏమైనా జరిగితే అప్‌సెట్‌ అవుతాం. వారు స్వేచ్ఛగా ఆడుకునే అవకాశం ఇస్తూనే కనిపెడుతూ ఉండాలి. జలాశయాలు, సాగరం తీరం వద్ద వనభోజనాలు ఏర్పాటు చేస్తే అప్రమత్తంగా ఉండాలి. జలపాతాల వద్ద ఆటలు వద్దు. పిల్లలను ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా వదిలేయ్యొద్దు. వెంట ఎవరో ఒకరు ఉండాలి.

కార్తీకంలో వనభోజనాలు పుణ్యం..

కార్తీక మాసంలో శివ, కేశవులను పూజించడం పుణ్యం. దీంతో పాటు వనభోజనాలకు వెళ్లడం కూడా పుణ్య ఫలం ఇస్తుంది. ఏటా కార్తీక మాసంలో వనభోజనాలు ఏర్పాటు చేసి భక్తులు దేవతామూర్తులను పూజిస్తారు.

– అయినవోలు రాధాకృష్ణ శర్మ, శ్వేతార్క ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకుడు

కార్తీక మాసంలో వెళ్తే మంచి జరుగుతుందని నమ్మకం

అనాదిగా వస్తున్న సంప్రదాయం

ఆధునిక యుగంలోనూ కొనసాగింపు..

కుల సంఘాల సమ్మేళనంగా మార్పు

వారాంతపు రోజులకు భిన్నం..

వనభోజన కార్యక్రమాలకు కూడా వారాంతపు రోజుల్లోనే నిర్వహించుకున్నప్పటికీ సాధారణంగా వీకెండుకు ఇది భిన్నమని గుర్తించాలి. వీకెండ్‌లో సాధారణంగా కలిసే మిత్రులు, ఉద్యోగులు కార్తీక మాసంలో వనభోజనాలకు వెళ్తుంటారు. ఇందు కోసం దూర ప్రాంతాలను ఎంచుకుంటారు. ఏడాది మొత్తం ఎక్కడెక్కడ ఉన్నా ఏటా వనభోజనాలకు అందరూ ఒక్కచోటుకు రావడం కొంత మంది అలవాటుగా మార్చుకున్నారు.

వనభోజనం.. పుణ్యఫలం1
1/2

వనభోజనం.. పుణ్యఫలం

వనభోజనం.. పుణ్యఫలం2
2/2

వనభోజనం.. పుణ్యఫలం

Advertisement
 
Advertisement
Advertisement