Telangana Crime News: 'కూలికి వెళ్లొస్తా..జాగ్రత్త బిడ్డా..!' అంతలోనే ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు!
Sakshi News home page

'కూలికి వెళ్లొస్తా..జాగ్రత్త బిడ్డా..!' అంతలోనే ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు!

Sep 24 2023 1:34 AM | Updated on Sep 24 2023 8:59 AM

- - Sakshi

సాక్షి, వరంగల్‌: జాగ్రత్తగా బడికి పోయిరా.. కూలికి వెళ్లొస్తా అంటూ ..బిడ్డకు జాగ్రత్తలు చెప్పి పనికి బయల్దేరిన మహిళను మృత్యువు.. ఆర్టీసీ బస్సు రూపంలో కబలించింది. ఈ ఘటన వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్‌ బంక్‌ సమీ పంలో జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దంపతులు స్వల్పగాయాలతో బయటపడగా, ఓ మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందింది.

ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం చెన్నారావుపేట మండలం సమీప గ్రామాలకు చెందిన బానోతు సుజాత, బాలు దంపతులు బతుకు దెరువు కోసం ఐదేళ్ల క్రితం హనుమకొండ వడ్డేపల్లికి చేరుకున్నారు. ఇక్కడే ఉంటూ భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ఇద్దరి పిల్లలను చదివించుకుంటున్నారు.

బానోత్‌ సుజాత సొంత అక్క భూక్య బుజ్జీ (35). బుజ్జీ తన భర్తకు దూరంగా ఉంటూ తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని మూడేళ్ల క్రితం వడ్డేపల్లికి చేరుకుంది. పెద్ద కూతురు భాను 7వ తరగతి చదువుతుండగా చిన్న కూతురు ను బంధువులకు దత్తత ఇచ్చింది. ఈ క్రమంలో సుజాత, బాలు, బుజ్జీ ముగ్గురు కలిసి ఒకే ద్విచక్రవాహనంపై భవన నిర్మాణ పనికి వెళ్తుంటారు. రోజువారీగానే శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఒకే బైక్‌పై వడ్డేపల్లి నుంచి మామునూరుకు బయలుదేరారు.

ఈ క్రమంలో వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై నాయుడు పెట్రోల్‌ బంక్‌ సమీపంలో వరంగల్‌ నుంచి తొర్రూరు వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. బైక్‌ను ఢీకొంది. దీంతో భార్యాభర్తలు సుజాత, బాలు రోడ్డుపై పడిపోగా.. బుజ్జీ బస్సు వెనక టైర్‌ కింద పడింది. దీంతో అక్కడిక్కడే దుర్మరణం చెందింది. స్వల్పగాయాలతో బయటపడిన భార్యాభర్తలను స్థానికులు వెంటనే 108లో ఎంజీఎం తరలించారు.

ఈ విషయం తెలిసిన మృతురాలి కుమార్తె భాను.. తల్లి మృతదేహంపై పడి కన్నీరు మున్నీరుగా విలపించింది. రోడ్డు ప్రమాద విషయం తెలియగానే మామునూరు ఎస్సైలు కృష్ణవేణి, ప్రమోద్‌కుమార్‌ హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకున్నారు. మహిళ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. అనంతరం మృతురాలి బంధువు బాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు తెలిపారు.

పెద్ద దిక్కు కోల్పోయి..
హన్మకొండ వడ్డేపల్లిలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న భూక్య బుజ్జీ(35).. భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేస్తూ కుమార్తెను చదివిస్తోంది. తన కూతురును ఉన్నతంగా చూడాలకుంది. ఇంతలోనే కనిపించని లోకాలకు వెళ్లింది. బిడ్డను బడికి సాగనంపి చెల్లి, మరిదితో కలిసి బైక్‌పై బయల్దేరిన బుజ్జీ.. కొద్ది నిమిషాల్లోనే రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దీంతో కూతురు 7 ఏళ్ల చిన్నారి భాను పెద్దదిక్కును కోల్పోయింది.

డ్రైవర్‌ను చితకబాదిన బాధితులు..
అతివేగంగా.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తోనే రోడ్డు ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహానికి లోనైన బాధితులు, స్థానికులు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని బాధితులు, స్థానికులను ఘటనా స్థలి నుంచి దూరంగా పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement