పాత కక్షలతోనే దాడులు | - | Sakshi
Sakshi News home page

పాత కక్షలతోనే దాడులు

May 27 2026 6:14 AM | Updated on May 27 2026 6:14 AM

● ఈడిగ వీరేంద్ర వర్గీయుల ఇళ్లపై దాడి కేసులో 16 మంది నిందితుల అరెస్టు

● ఈడిగ వీరేంద్ర వర్గీయుల ఇళ్లపై దాడి కేసులో 16 మంది నిందితుల అరెస్టు

పత్తికొండ: ఆరురోజుల క్రితం బిల్లేకల్‌ గ్రామంలో ఒకవర్గంపై మరో వర్గం వారు దాడి చేసిన కేసును పోలీసులు ఛేదించారు. పాతకక్షలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. మంగళవారం పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య ఆస్పరి సీఐ శ్రీనువాసునాయక్‌తో కలసి తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరి మండలం బిల్లేకల్‌ గ్రామంలో చింతమాను రోగన్న, ఈడిగ వీరేంద్ర వర్గాల నడుమ వైరం ఉంది. కూరగాయలకు ప్రసిద్ధి గాంచిన బిల్లేకల్‌ మార్కెట్‌లో వేలం పాట వ్యవహారంలో నాలుగునెలల క్రితం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడేవారు. దీంతో పోలీసులు ఇరువర్గాలకు చెందిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక చింతమాను రోగన్న వర్గం వారు పాతకక్షలను మనస్సులో పెట్టుకొని ప్రత్యర్థి అయిన ఈడిగ వీరేంద్ర వర్గీయుల ఇళ్లపై ఆరురోజుల క్రితం వేటకొడవళ్లు, కట్టెలతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు మహిళలు గాయపడటంతో పాటు ప్రత్యర్థులకు చెందిన వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 16 మంది నిందితులను మంగళవారం ఉదయం ఆస్పరి గ్రామ శివారులో అరెస్టు చేసి పత్తికొండ కోర్టులో హాజరు పరిచారు. కేసును త్వరగా ఛేదించిన ఆస్పరి సీఐ శ్రీనువాసునాయక్‌, పోలీసు సిబ్బందిని డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement