మంత్రి టీజీ భరత్ వైఖరితో
కర్నూలులో అరాచక వాతావారణం
ఓ ఫార్మాకంపెనీ నుంచి రూ.45కోట్లు లోకేశ్‌కు తెలీకుండా భరత్ లంచం తీసుకున్నారని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపించారు. అలాగే ఓర్వకల్లు వద్ద మంత్రికి 1,100 ఎకరాల భూమి ఉందని ఆరోపించారు. వీటిపై మంత్రి ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసుస్టేషన్‌లో పరువునష్టం దావా కేసు నమోదు చేశారు. అయితే దీనిపై వైఎస్సార్‌సీపీ ఘాటుగానే స్పందిస్తోంది. ఫార్మా కంపెనీ పేరు చెబితే వారితో తిరిగి ప్రెస్‌మీట్ పెట్టించి ఖండించేలా చేస్తారని, ఆధారాలు కోర్టుకు సమర్పిస్తానని సిద్ధార్థ చెబుతున్నారు. అలాగే మంత్రి బంధువు టీజీ విశ్వప్రసాద్‌కు 1,100 ఎకరాలు కట్టబెట్టింది నిజం కాదా? అని ఆ పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. యువగళం పాదయాత్రలో అప్పటి ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ సుల్తానియా మసీదుకు చెందిన 1.5 ఎకరాల వక్ఫ్‌భూమిని కబ్జా చేశారని లోకేశ్ ఆరోపించారని, దానిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు కడతారా? అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది. ఆరోపణలకు సమాధానం చెప్పలేక కేసులతో భయపెట్టే చర్యలకు మంత్రి ఉపక్రమిస్తున్నారని వైస్సార్‌సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
ప్రశాంత వాతావరణం ఉన్న నగరం కర్నూలు. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇక్కడ రౌడీయిజం, ఫ్యాక్షన్, కక్ష సాధింపులు, వేధింపులు ఎప్పుడూ లేవు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎవ్వరు అధికారంలో ఉన్నా ప్రశాంతంగా ఉండేది. అయితే తొలిసారి మంత్రి టీజీ భరత్ ఎమ్మెల్యే అయిన తర్వాత విపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలపై వేధింపులు, కక్ష సాధింపులు ఎక్కువయ్యాయని వైఎస్సార్‌సీపీ ఆందోళన చేపట్టింది. అధికార అండతో పోలీసులను అస్త్రంగా చేసుకుని ఈ వేధింపులకు దిగుతున్నారనేది విపక్ష పార్టీ ప్రధాన ఆరోపణ. మంత్రి టీజీ భరత్ వేధింపులు, అవినీతి ఆరోపణలపై మాత్రమే సిద్ధార్థ ఆరోపణలు చేశారు. టీడీపీ నేతగా మంత్రి దీనికి సమాధానం చెప్పాలి. కానీ టీడీపీకి బీజేపీ వత్తాసు పలికినట్లు టీజీ వెంకటేశ్ పరోక్షంగా సిద్ధార్థపై విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా సిద్ధార్థ కూడా ఘాటుగా బదులిచ్చారు.
ఈ దారుణాలకు సమాధానం ఏంటి టీజీ?!
మంత్రి అనుచరుడు, టీడీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపులతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్‌నోట్ రాసి దళిత కార్యకర్త సతీశ్ ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ ఉన్నా పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? చిన్న పోస్టు పెడితేనే కేసు నమోదు చేసే పోలీసులు సూసైడ్ నోట్ ఉన్నా కేసు నమోదు చేయకపోవడానికి భరత్ కారణం అని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.
● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు బాలు పార్టీలో చురుగ్గా ఉన్నారనే కారణంతో అతని వాహనంలో 20 లీటర్ల నాటుసారా ఉందని త్రీటౌన్ పోలీసులు తప్పుడు కేసు నమోదు చేశారని విపక్షపార్టీ ఆరోపించింది.
● 10వ వార్డు మాజీ కార్పొరేటర్ యూనస్ ఆఫీసును భరత్ అనుచరుడు అయూబ్‌ఖాన్ ధ్వంసం చేశారు. విచిత్రమేంటంటే తిరిగి యూనస్‌పైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మంత్రి అండదండలతో అయూబ్ రేషన్ బియ్యం వ్యాపారం చేస్తున్నారనేది బహిరంగసత్యమే.
● వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం నేత తిరుమలేశ్వరరెడ్డి మంత్రి భరత్ ఇంటి సమీపంలో నివాసం ఉంటారు. ఇతని ఇంటివద్ద కార్లు అడ్డంపెట్టి రౌడీయిజం చేసి తిరిగి అతనిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
● బిజినేపల్లి సందీప్ అనే వ్యక్తి కార్పొరేషన్‌లో ఎవ్వరూ టెండర్లలో పాల్గొనవద్దని వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టారు. ఈ స్క్రీన్‌షాట్లతో సహా సాక్షి కథనం ప్రచురిస్తే సాక్షిపై కేసు నమోదు చేశారు.
● ఏ, బీ, సీ క్యాంపులు ఖాళీ చేయాలని అక్కడి నివాసితులను వేధించడం, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ప్రభుత్వ ఆస్తిని కూల్చేసి కాజేసే కుట్ర జరుగుతోందని కథనాలు రాస్తే సాక్షిపై మరో 4 కేసులు నమోదు చేశారు.
● డోన్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి తాండ్రపాడులో నివాసం ఉంటున్నారు. భరత్ సోషల్ మీడియా అకౌంట్‌లో ‘జై జగన్’ అని కామెంట్ చేస్తే అతన్ని పట్టుకుని వచ్చి భరత్ కాళ్లు పట్టించుకుని ‘అయ్యా క్షమించండి’ అని చెప్పించుకుని వదిలేశారని నాగరాజు, సిద్ధార్థ వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు.
● కిమ్స్ ఆస్పత్రిలో పని చేసే జొహరాపురం వాసి కూడా ‘జై జగన్’ అని కామెంట్ పెడితే అతన్ని కొట్టి మంత్రి కాళ్లు పట్టించారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.
విపక్షపార్టీపై వేధింపులు, కక్ష సాధింపులు
టీడీపీ నేత తిలక్ తీరుతో
వైఎస్సార్‌సీపీ కార్యకర్త సతీశ్ ఆత్మహత్య
సూసైడ్ నోట్‌లో తిలక్ పేరు రాసినా
కేసు నమోదు చేయని పోలీసులు
మంత్రి భరత్ అరాచకాలపై
నిరసన చేపట్టిన వైఎస్సార్‌సీపీ
మంత్రి టీజీ ఓ ఫార్మా కంపెనీ నుంచి
రూ.45కోట్లు తీసుకున్నారని బైరెడ్డి ఆరోపణ
బైరెడ్డి సిద్ధార్థరెడ్డిపై మంత్రి టీజీ ఫిర్యాదు..
కర్నూలు త్రీటౌన్‌లో కేసు నమోదు
టీజీ అక్రమాలు, అరాచకాలపై
ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ ప్రణాళిక


