● హెచ్చరిక బోర్డుల్లేని ఎన్‌హెచ్ – 340సీ రోడ్డుపై ప్రమాదం ● బ్యాంకు పనిపై వెళుతుండగా ఘటన
జూపాడుబంగ్లా: బ్యాంకు పని నిమిత్తం వెళ్తూ హైవేలో డివైడర్‌ను ఢీకొట్టడంతో తండ్రి రంగన్న అలియాస్ రాజేష్ (32) అతని రెండేళ్ల కుమారుడు విశ్వక్‌రాణా తలలు పగిలి అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనపై ఎస్‌ఐ మల్లికార్జున, మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. నందికొట్కూరు మండలం బ్రాహ్మణకొట్కూరుకు చెందిన రాజేష్ ఆరేళ్లుగా పాములపాడు మండలం రుద్రవరంలో వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. భార్య కర్నూలులోని ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బుధవారం బ్రాహ్మణకొట్కూరు బ్యాంకులో పని నిమిత్తం రెండేళ్ల కుమారుడు విశ్వక్‌రాణాను తీసుకొని రుద్రవరం నుంచి ఏపీ 40 కేవీ 0071 నంబర్‌గల బైక్‌పై బయలుదేరాడు. జూపాడుబంగ్లా సమీపంలో కేసీ కాల్వ బ్రిడ్జి దాటి పోలీసుస్టేషన్ సమీపిస్తుండగా బైక్ అదుపుతప్పి రోడ్డుమధ్యనున్న డివైడర్‌ను ఢీకొట్టింది. రాజేష్, కుమారుడు విశ్వక్‌రాణా ఎగిరి డివైడర్‌పై పడటంతో తలలు నరుక్కపోయాయి. వారు అక్కడిక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకొన్న నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం, జూపాడుబంగ్లా ఎస్‌ఐ మల్లికార్జున ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. నెత్తుటి మడుగులో రోడ్డుపై పడిఉన్న మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడి భార్య శీరిష ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబుసభ్యులకు అప్పగించారు. మృతుడు నడిపిన బైక్ పెద్దగా డ్యామేజ్ కాకపోవటం, తండ్రి, కుమారుడు ఒకేలా మృతిచెంది ఉండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


