● అందుకే రాష్ట్రంలో పెట్రోల్,
డీజిల్ సంక్షోభం
● ప్రజల ఇబ్బందులను స్వయంగా
పరిశీలించిన కాటసాని
కల్లూరు: డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కు కావడంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ సంక్షోభం మొదలైందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు నగరంలోని గుత్తి పెట్రోల్ బంకును స్వయంగా కాటసాని పరిశీలించారు. అక్కడ వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులను, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత ఉందన్నారు. మూడు రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైందన్నారు. అయినా చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం కనీసం చలనం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రమంత్రిని సంప్రదిస్తే, ఎక్కడా సరఫరాలో లోటు లేదని, ఒక్క ఇండెంట్ కూడా పెండింగ్ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారన్నారు. మరి అలాంటప్పుడు రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు.
70 శాతం బంకుల్లో నోస్టాక్ బోర్డులా?
నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతారని ప్రచారం జరుగుతుండడంతో డీలర్లు స్టాక్ ఉంచేస్తున్నారని కాటసాని అన్నారు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. డీలర్లు, ప్రభుత్వం కుమ్మక్కు కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందన్నారు. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కృత్రిమ కొరత సృష్టించారన్నారు. రాష్ట్రంలో 4,510 బంక్‌లు ఉండగా 70 శాతం బంకులు నోస్టాక్ బోర్డు పెట్టారన్నారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదన్నారు. సరఫరాలో సంక్షోభం లేదన్నారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే ఈ పరిస్థితి ఉందంటే ఇందులో కచ్చితంగా ప్రభుత్వం, డీలర్లు కుమ్మక్కయ్యారని చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తోందన్నారు. కాటసాని వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు ఉలిందకొండ రమణారెడ్డి, సుంకన్న తదితరులు ఉన్నారు.


