పాణ్యం: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ రంగం కీలకమని కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి కేలచంద్ర జోసెఫ్‌జార్జ్ అన్నారు. సోమవారం పిన్నాపురంలో గ్రీన్‌కో సంస్థ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తిలో ఈ ప్లాంట్ ప్రత్యేకమైనది, ప్రపంచలోనే అతి పెద్ద సమీకృత పునరుద్పాదక ప్రాజెక్టు అన్నారు. దేశంలోని ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విద్యుత్ ఉత్పత్తి ఎంతో అవసరమన్నారు. ఒక విద్యుత్ ప్రాజెక్టు నెలక్పొడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో పాటు ఫారెస్ట్ శాఖ సహకారం కూడా అవసరమన్నారు. కర్ణాటక శరావతిలో 125 ఎకరాల్లో విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు జరుగుతుందన్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుందన్నారు. గ్రీన్‌కో సంస్థ ఏపీతో పాటు రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పి దేభాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. మంత్రి వెంట కర్ణాటక చెందిన రెన్యూవబుల్ ఎనర్జీ చెర్మన్ రాజేగౌడ, అడిషినల్ సీఎస్ గౌరవ్‌గుప్తా, గ్రీన్‌కో ఎండీ చలమశేట్టి అనిల్‌మహేష్, గ్రీన్‌కో ప్రతినిధులు, నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్, తహసీల్దార్ శివశంకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


