లోకాయుక్త డీడీగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి బి. సునీత | - | Sakshi
Sakshi News home page

లోకాయుక్త డీడీగా రిటైర్డ్‌ జిల్లా జడ్జి బి. సునీత

Apr 11 2026 8:22 AM | Updated on Apr 11 2026 8:22 AM

కర్నూలు(సెంట్రల్‌): లోకాయుక్త డిప్యూటీ డైరక్టర్‌గా రిటైర్డ్‌ జిల్లా జడ్జి బి.సునీత నియమితులయ్యారు. ఈమె చార్జి తీసుకున్న రోజు నుంచి ఏడాదిపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు లోకాయుక్త రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేశారు.

ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాల కేటాయింపు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాలు కేటాయిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు విత్తనాల కోసం పంపించిన ప్రతిపాదనలను ప్రభుత్వం పక్కనపెట్టి అరకొరగా కేటాయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లాకు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు 12,674 క్వింటాళ్లు, రబీ సీజన్‌కు 9480 క్వింటాళ్లు కేటాయించింది. వేరుశనగ కర్నూలు జిల్లాకు 10,723 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2136 క్వింటాళ్లు, కొర్ర కర్నూలు జిల్లాకు 76 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 27 క్వింటాళ్లు, మినుములు నంద్యాల జిల్లాకు 40 క్వింటాళ్లు చొప్పున కేటాయించింది. కర్నూలు జిల్లాలో కూడా మినుము సాగవుతున్నప్పటికీ కేటాయింపులు లేకపోవడం గమనార్హం. పచ్చ రొట్ట ఎరువుల విత్తనాలైన దయంచ కర్నూలు జిల్లాకు 1,681 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 5,685 క్వింటాళ్లు, సన్‌హెంప్‌ విత్తనాలు కర్నూలు జిల్లాకు 4 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 76 క్వింటాళ్లు, పిల్లి పెసర విత్తనాలు కర్నూలు జిల్లాకు 190 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 1516 క్వింటాళ్ల ప్రకారం కేటాయించింది.

లేఖ రచన విజేతలకు బహుమతులు

కర్నూలు(అర్బన్‌): తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ధై అఖర్‌ లేఖ రచన పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందించినట్లు కర్నూ లు డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ జి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తపాల శాఖ ఫిలాటెలీ(స్టాంపుల సేకరణ) లేఖ రచనను ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది వివిధ రకాలైన పోటీలను నిర్వహిస్తోందన్నారు. ధై అఖర్‌ లేఖ రచన పోటీలను నాలుగు విభాగాలలో నిర్వహించామన్నారు. 2025–26 సంవత్సరానికి నిర్వహించిన పోటీల్లో కర్నూలు డివిజన్‌కు చెందిన ముగ్గురు రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచారన్నారు. షేక్‌ మెహనాజ్‌ మొదటి బహుమతిగా రూ.25 వేలు, వై.సింధు రెండవ బహుమతిగా రూ.10 వేలు, సీ.పుల్లయ్య మూడవ బహుమతిగా రూ.5 వేలు అందుకున్నారన్నారు.

నేడు మూడు మండలాలకు ఎల్లో అలర్ట్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉమ్మడి కర్నూలు జిల్లా నిప్పుల కుంపటిగా మారుతోంది. ఈ నెల 11న నంద్యాల జిల్లాలోని పలు మండలాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది. శనివారం వెలుగోడులో 44.5, ఆత్మకూరులో 44.8, కొత్తపల్లిలో 44.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉండే ప్రమాదం ఉన్నట్లు స్పష్టం చేశారు. కాగా శుక్రవారం బనగానపల్ల్లెలో 42.3, నంద్యాల రూరల్‌లో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆళ్లగడ్డలో 41.9, చాగలమర్రిలో 41.9, సంజామలలో 41.8, రుద్రవరంలో 41.7, కర్నూలులో 41.4, గడివేములలో 41.4 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరోసారి ఏహెచ్‌ఏల సర్టిఫికెట్ల పరిశీలన

కర్నూలు(అగ్రికల్చర్‌): పశుసంవర్ధక శాఖలో నకిలీ సర్టిఫికెట్లతో ఏహెచ్‌ఏ ఉద్యోగాలు పొందారనే ఆరోపణలపై మరోసారి సర్టిఫికెట్ల పరిశీలనకు రంగం సిద్ధమైంది. పశుసంవర్ధక శాఖలో అప్పటికే అవుట్‌ సోర్సింగ్‌ కింద పనిచేసే అటెండర్లు, గోపాలమిత్రలు తదితరులకు ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీలో వెయిటేజీ మార్కులు ఇచ్చింది. ఒకవైపు ఉద్యోగాలు చేస్తున్న వారిలో కొందరు అదే సమయంలో డిప్లమా కోర్సులు పూర్తి చేసినట్లుగా సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినట్లు అనుమానాలు ఉన్నాయి. కొందరు ఏహెచ్‌ఏలపై లోకాయుక్తతో పాటు హైకోర్టులో కేసులు కూడా వేశారు. రాష్ట్రం మొత్తం మీద 1,200 మంది ఈ విధంగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏహెచ్‌ఏల వెయిటేజీ మార్కులు, సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ డైరెక్టర్‌ దామోదరనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా ఇచ్చారు. దీనిని పూర్తి చేయడంతో పాటు ఒరిజినల్‌ సర్టిఫికెట్లు పరిశీలించిన తర్వాత జిరాక్స్‌ ప్రతులను తీసుకొని డైరెక్టరేరేట్‌కు పంపడానికి అధికారులు చర్యలు చేపట్టారు. డైరెక్టరేట్‌ నుంచి ధృవపత్రాలు సంబంధిత కాలేజీలు, యూనివర్సిటీలకు పంపనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement