● జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
కర్నూలు(సెంట్రల్): తాగునీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి హెచ్చరించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో శుక్రవారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్‌వెల్స్ తరచూ పాడవడంతో తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. తుంగభద్ర డ్యామ్ నుంచి జనవరి 20వ తేదీ వరకు ఎస్‌ఎస్ ట్యాంకులు, మైనర్ ఇరిగేష్ ట్యాంకులను నింపుకున్నామన్నారు. మార్చి 20వ తేదీ నుంచి ట్యాంకులు, చెరువులను నింపడం ప్రారంభమైనందున ఆగస్టు చివరి వరకు నీటి కొరత ఉండబోదన్నారు. నీటి వనరులు ఉన్నా కొన్ని చోట్ల కొరత ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. ప్రతి ప్రాంతానికి సమానంగా నీటి సరఫరా జరగాలన్నారు. ఎక్కడైనా పక్షపాతం, నిర్లక్ష్యం జరిగితే సహించబోనని హెచ్చరించారు. పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి గ్రామాల్లో చెత్త కుప్పలు పేరుకుపోయాయని, క్రమం తప్పకుండా వాటిని పారిశుద్ధ్య సిబ్బందితో శుభ్రం చేయించాలని డీపీఓను ఆదేశించారు. పత్రికల్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రతి కూల వార్తలు రెండు, మూడు సార్లు వస్తే మూడు ఇంక్రిమెంట్లు కట్ చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల్య వివాహాల నివారణపై దృష్టి సారించాలన్నారు. తాను కోసిగి పర్యటనలో ఒక బాల్య వివాహాన్ని ఆపినట్లు చెప్పారు. కొన్ని చోట్ల అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తడిచెత్తను వర్మీ కంపోస్టుగా తయారు చేసినట్లు కనిపించడంలేదన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, జిల్లా పరిషత్ సీఈఓ రమణారెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ కామేశ్వరరావు, ఐసీడీఎస్ విజయ, డీపీఓ భాస్కర్, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి పాల్గొన్నారు.


