● ప్రైవేట్ స్కూల్‌లో పది స్పాట్ కేంద్రం ● ఒకే ఫ్లోర్‌లో ఒకవైపు తరగతులు... మరోవైపు మూల్యాంకనం ● ఉపాధ్యాయులకు అరకొరగా బెంచీల ఏర్పాటు ● నిబంధనలకు విరుద్ధంగా స్పాట్ కేంద్రంలోకి సెల్‌ఫోన్ల అనుమతి
కర్నూలు సిటీ: పదవ తరగతి పరీక్షల మూల్యాంకనం అసౌకర్యాల మధ్య సాగుతోంది. అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదు. జిల్లాలో ఈ నెల 6వ తేదీ నుంచి పది పరీక్షల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నెల 16వ తేదీ వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. కర్నూలు నగరంలోని ఏక్యాంపులోని మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం స్కూల్‌లో స్పాట్ కేంద్రం ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి 1,88,742 సమాధాన పత్రాలు వచ్చాయి. వీటిని మూల్యాంకనం చేసేందుకు అసిస్టెంట్ ఎగ్జామినర్లు 494, చీఫ్ ఎగ్జామినర్లు 107, స్పెషల్ అసిస్టెంట్లు 231 మంది మొత్తం 832 మందిని నియమించారు. స్పాట్ నిర్వహించేందుకు ఇంత వరకు సరైన కేంద్రమే లేదు. ప్రతి ఏటా ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు ప్రైవేటు స్కూళ్లలోనే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి ఏక్యాంపులోని మాంటిస్సోరి స్కూల్‌లో కేంద్రం ఏర్పాటు విషయం ఆ స్కూల్ యాజమాన్యానికి తెలియజేయకుండానే ప్రకటించారు. తర్వాత స్కూ ల్ యాజమాన్యం తమకు ఇబ్బంది అవుతుందని చెప్పినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోకుండా ఆ స్కూల్ భవనంలోని ఓ ఫ్లోర్‌లో ఒక వైపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ఉపాధ్యాయులు ఉక్కపోతతోనే మూల్యాంకనం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు.
ఒక వైపు మూల్యాంకనం...మరో వైపు క్లాసులు
పది స్పాట్ కేంద్రానికి కేటాయించిన ఫ్లోర్‌లోనే ఓ వైపు సమాధాన పత్రాల మూల్యాంకనం మరోవైపు ఆ స్కూల్ విద్యార్థులకు తరగతులు జరుగుతున్నాయి. కేంద్రంలో ఉపాధ్యాయులకు రూంలు సరిపోకపోవడంతో హాల్‌లో ఏర్పాటు చేశారు. అయితే, అక్కడ సరైన బెంచీలు కూడా లేవు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షల మూల్యాంకనం చేసేటప్పుడు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఉపాధ్యాయులు పేపర్లను దిద్దాల్సి ఉంటుంది. అలాంటి ఒకే ఫ్లోర్‌లో తరగతులు, మూల్యాంకనం ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక బెంచీపై ఇద్దరు కూర్చోవాల్సి ఉండగా ..ముగ్గురు, నలుగురు కూర్చొని మూల్యాంకనం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కేంద్రంలోకి ఎలాంటి సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. కానీ స్పాట్‌లో పాల్గొంటున్న ఉపాధ్యాయులు వారి పక్కనే సెల్‌ఫోన్లు పెట్టుకొని వాటిలో మాట్లాడుతూ మూల్యాంకనం చేస్తున్నారు. మరికొందరు సమాధానాలను సైతం సెల్‌ఫోన్లలో చూసి కరెక్షన్స్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై డీఈఓ ఎల్.సుధాకర్‌ను వివరణ కోరగా మూల్యాంకన కేంద్రం కోసం సొంత భవనం లేదని, అలాగే స్పాట్ సెంటర్‌లోకి ఉపాధ్యాయులు సెల్‌ఫోన్లు తీసుకురాకూడదని ఆదేశాలు ఇచ్చామని, ఎవరైనా తెచ్చుకుంటే ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోవాలని సూచించినట్లు వెల్లడించారు.


