అదిలాబాద్‌ అదనపు జిల్లా జడ్జిగా జిల్లా వాసి | - | Sakshi
Sakshi News home page

అదిలాబాద్‌ అదనపు జిల్లా జడ్జిగా జిల్లా వాసి

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

కర్నూలు: కర్నూలు కు చెందిన న్యాయ వాది బి.సి.శశికుమార్‌ అదిలాబాద్‌ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక సెషన్స్‌ జడ్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఈనెల 9వ తేదీ బాధ్యతలు చేపట్టనున్న శశికుమార్‌ పది సంవత్సరాల నుంచి కర్నూలులో సీనియర్‌ న్యాయవాది సీపీ మద్దిలేటి వద్ద జూనియర్‌ లాయర్‌గా పనిచేశారు. 2025 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జిల్లా జడ్జి పోస్టుల పోటీ పరీక్షకు హాజరై విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఆయనను అదిలాబాద్‌ జిల్లా అదనపు జడ్జిగా నియమిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలు జిల్లాలోనే కాక ఉమ్మడి ఏపీలో పేరున్న రంగస్థలం నటుడైన స్వర్గీయ బీసీ కృష్ణకు బి.సి.శశికుమార్‌ కుమారుడు. జిల్లా జడ్జి పోస్టుకు ఎంపికై నందుకు ఆయనను పలువురు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు అభినందించారు. ఏపీకి చెందిన వ్యక్తి తెలంగాణలో జడ్జి పోస్టు సాధించడం విశేషం.

జననీ బ్యాంకు బాధితురాలు ఆత్మహత్యాయత్నం

కోవెలకుంట్ల: కోవెలకుంట్లలోని జననీబ్యాంకు బాధితురాలు బుధవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు అందించిన సమాచారం మేరకు.. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో నివాసం ఉంటున్న సూరమ్మ రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ. 20 లక్షలు డిపాజిట్‌ చేసింది. అధిక వడ్డీల ఆశ చూపి ఖాతాదారుల నుంచి లక్షలాది రూపాయాలు డిపాజిట్లు చేయించుకున్న బ్యాంకు గత ఏడాది బోర్డు తిప్పివేసింది. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి బ్యాంకు సీఈఓ రమణతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఏడాది గడిచినా డిపాజిట్‌ సొమ్ము తిరిగి ఇవ్వకపోవడం, డిపాజిట్‌ చేసేందుకు ప్రోత్సహించిన మహిళల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదు. దీంతో మనస్థాపం చెందిన సూరమ్మ ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుమారుడి షాపులో పనిచేస్తున్న గుమాస్త ఇంటి వద్దకు వెళ్లగా అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గమనించి చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement