● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నందికొట్కూరు: భూములకు సంబంధంచిన రీసర్వే వేగవంతంగా జరిగేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. మిడుతూరు తహసీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. భూ రీసర్వేపై రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తండ్రి చనిపోతే భాగ పరిష్కరాలు చేసుకున్న కుమారు ల పేర్లు రికార్డులలో ఉండకుండా తండ్రి పేరే ఉంటుందని ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. మ్యుటేషన్స్ చేయడంలో వీఆర్వోలు అలసత్వం చేస్తునట్లు తెలుస్తోందని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రీవెన్స్‌లో ఎక్కువ భూ సమస్యలే ఉన్నాయని, వాటి పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటునట్లు తెలిపారు.
ఒకే కుటుంబంపై 25 ఎకరాల భూమి!
గతంలో తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన మహిళా ఉద్యోగి చింతలపల్లెలో రెండు ఎకరాలను తన పేరు మీద ఆన్‌లైన్ చేసుకొని అమ్మేశారని, అలగనూర్ గ్రామ పొలిమేరలో భర్త పేరుతో, బంధువుల పేరుతో సుమారు 20 ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని జిల్లా కలెక్టర్ దృష్టికి స్థానికులు తెచ్చారు. అసైన్ కమిటీ రిజిష్టర్‌ను చించేశారని కొందరు తెలిపారు. సుంకేసుల గ్రామంలో సుమారు 25 ఎకరాల భూమిని ఒకే కుటుంబంపై ఆన్‌లైన్‌లో నమోదు చేశారని కలెక్టర్ తెలియజేశారు. వచ్చే బుధవారం 15వ తేదీన భూ సమస్యలను పరిష్కరించేందుకే తహసీల్దార్ కార్యాలయానికి వస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 29 వేల ఎకరాల భూములున్నాయని, వాటిలో రైతులకు చెందినవి ఎంత, ప్రభుత్వ భూములెన్నీ తేల్చాల్సి ఉందన్నారు. సమీక్ష సమావేశంలో తహసీల్దార్, ఆర్‌ఐ జహంగీర్‌బాషా, సర్వేయర్ కృష్ణుడు, వీఆర్వోలు పాల్గొన్నారు, అనంతరం మురికి కుపాలుగా తలపిస్తున్న రోడ్లను కలెక్టర్ పరిశీలించారు. సీసీ రోడ్లు వేయాలని స్థానిక మహిళలు కోరారు. ఎంపీడీవో దశరథరామయ్య, ఏవో సురేష్, తదితరులు పాల్గొన్నారు.


