● ప్రత్యేక బృందాల తనిఖీలో బట్టబయలు ● 115 గ్యాస్ సిలిండర్లు సీజ్
కర్నూలు(సెంట్రల్): కర్నూలు నగరంలో భారీగా గ్యాస్ సిలిండర్లు దారి మళ్లిన విషయం బట్టబయలైంది. స్వయగా సివిల్ సప్‌లై శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైనా ప్రత్యేక బృందాలు ఆ శాఖ పనితీరును తేటతెల్లం చేశాయి. బుధవారం ప్రత్యేక బృందాలు నిర్వహించిన సోదాల్లో నగరంలోని వివిధ హోటళ్లు, ఇతర ప్రాంతాల్లో 115 డొమెస్టిక్ సిలిండర్లను పట్టుకొని సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను అర్బన్ ఏఎస్‌ఓ కార్యాలయంలో డీఎస్‌ఓ ఎం.రాజారఘువీర్ వెల్లడించారు. నగరంలోని 156 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. పట్టుబడిన సిలిండర్లను సీజ్ చేశాక సంబంధిత వ్యక్తులు, సంస్థలపై 103 సిక్స్–ఏ కేసులను నమోదుచేసినట్లు చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌గా వినియోగించరాదన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి వినియోగిస్తే సంబంధిత సంస్థ లేదా వ్యక్తి హోటళ్లు, ఇతరాత్రాలకు సంబంధించిన సంస్థలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. మరోవైపు గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్లను దారి మళ్లిస్తే తీవ్రమైన చర్యలతో పాటు ఏజెన్సీని రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఎస్‌ఓ వెంకటరాజు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.


