ప్రాణం తీసిన మనస్పర్థలు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన మనస్పర్థలు

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

● కర్నూలులో విద్యార్థి హత్య

● కర్నూలులో విద్యార్థి హత్య

కర్నూలు: స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ హత్యకు దారి తీసింది. కర్నూలు బిర్లాగడ్డలో నివాసముంటున్న జగత్‌ గణేష్‌, పసుపుల సుజాత దంపతులకు ముగ్గురు కుమారులు సంతానం. చివరివాడైన బోయ కిరణ్‌ (17) గాయత్రి కళాశాలలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కృష్ణా నగర్‌కు చెందిన అస్లాం, ఇస్మాయిల్‌లతో కిరణ్‌కు మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్నేహితులు బడే సాహెబ్‌, రాజారెడ్డి, వినయ్‌తో కలసి మంగళవారం రాత్రి అస్లాం, ఇస్మాయిల్‌ల ఇంటి వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. ఘర్షణ తీవ్రమై ఒకరినొకరు కొట్టుకున్నారు. అస్లాం, ఇస్మాయిల్‌ కలసి కిరణ్‌ను బలంగా కిందికి తోసి కాలుతో కొట్టడంతో తలకు బలమైన గాయాలై సొమ్మసిల్లి పడిపోగా వెంట వెళ్లిన స్నేహితులు వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పాత కక్షల కారణంగానే అస్లాం, ఇస్మాయిల్‌ కలసి తన కుమారుడిపై దాడిచేసి హత్య చేశారని తల్లి పసుపుల సుజాత ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ ఎస్‌ఐ గోపీనాథ్‌ కేసు నమోదు చేసి విచారణ చేశారు. మృతదేహానికి మార్చురీ కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. స్నేహితుల మధ్య ఉన్న మనస్పర్థలే ఘర్షణకు దారితీయడంతో కిరణ్‌ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సంఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement